అన్ని చోట్లా అవినీతి తాండవం
సాక్షి, బళ్లారి: ఆయన ముక్కుసూటి మనిషి. సీనియర్ నాయకుడు. మచ్చలేని వ్యక్తి. తనకంటు సమాజంలో ఓ మంచి గుర్తింపు కలిగిన విధాన పరిషత్ సభ్యుడు కూడా. అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలపై తనదైన శైలిలో పార్టీలకు అతీతంగా ప్రజాగళాన్ని వినిపిస్తూ అందరినీ ఆకర్షించే వ్యక్తి. అన్ని పార్టీల్లో కూడా ఆయన మాట్లాడిన మాటలకు తప్పు పట్టే ప్రశ్నే ఉండదు. ఆయనే ఉమ్మడి బళ్లారి జిల్లా ఎమ్మెల్సీ వైఎం.సతీష్. బెళగావిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలతో పాటు ఆయన మరొక అంశంపై అసెంబ్లీలో చర్చించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
అధికారులు నన్నే లంచం అడిగారని ఆరోపణ
అయితే ఆయన అసెంబ్లీలో ముక్కుసూటిగా అధికారుల, ప్రజాప్రతినిధుల లంచావతారాలను ఎండగట్టారు. లంచం అనే మహమ్మారి పట్టిపీడిస్తోందని, అది ఏ స్థాయికి చేరిందంటే అధికారులు సిగ్గు, ఎగ్గు లేకుండా ఏకంగా ప్రజాప్రతినిధి అయినా తననే లంచం అడుగుతున్నారని విధాన పరిషత్‌లో తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేయడం కలకలం రేపింది. పనులు చేయడానికి తన వద్దకే వచ్చి లంచం ఇవ్వాలని అడుగుతున్నారన్నారు. దీంతో ఏ స్థాయికి అవినీతి, లంచాల తీరు దిగిజారిందో అర్థం చేసుకోవాలని సూచించారు. ఇది ఏమైనా న్యాయమా? అవినీతికి లైసెన్స్ ఇచ్చామా అని స్పీకర్‌ను ప్రశ్నించారు.
బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు లంచాల్లో ఆరితేరారు
విధాన పరిషత్‌లో ఎమ్మెల్సీ వైఎం.సతీష్ ఆవేదన


