విశాఖ రైలును రాయచూరు వరకు పొడిగించండి
రాయచూరు రూరల్: విశాఖపట్నం–మహబూబ్‌నగర్ మధ్య సంచరించే రైలును రాయచూరు వరకు పొడిగించాలని రాయచూరు, మహబూబ్ నగర్ లోక్‌సభ సభ్యులు విజ్ఞప్తి చేశారు. గురువారం న్యూఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఆయన కార్యాలయంలో కలిసిన రాయచూరు లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్, మహబూబ్ నగర్ లోక్‌సభ సభ్యురాలు డీకే అరుణ వినతిపత్రం సమర్పించారు. విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్‌కు ఉదయం 9 గంటలకు చేరుకునే ఈ రైలును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రాయచూరు వరకు పొడిగించాలని మంత్రిని కోరారు. తద్వారా రాయచూరు నుంచి కృష్ణా, మహబూబ్ నగర్, హైదరాబాద్, ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నవరం, తుని, అనకాపల్లి మీదుగా విశాఖపట్నం వరకు ప్రయాణించే అవకాశం కల్పించినట్లు అవుతుందన్నారు. విశాఖపట్నం రైలును రాయచూరు వరకు పొడిగిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వెళ్లి వచ్చే ప్రవాసాంధ్రులకు ఎంతో ఉపయోగ పడుతుందని నగరానికి చెందిన ప్రవాసాంధ్రుడు సూర్యదేవర నాగేశ్వరరావు పేర్కొన్నారు.


