కుక్కలను పట్టి తరలిస్తాం
● రేబిస్, సంతాన హరణ చికిత్సకు
షెడ్ నిర్మాణం
● నగరంలో స్థలాలను పరిశీలించిన
జిల్లా అధికారులు
సాక్షి బళ్లారి: నగరంలో కుక్కల బెడద ఉందని నగరవాసుల నుంచి ఫిర్యాదులు పెరిగిన నేపథ్యంలో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. బళ్లారి శివారున హాలదహళ్లి సమీపంలోని పది ఎకరాల్లో రూ.4 కోట్ల వ్యయంతో ప్రహరీ, కుక్కలకు వసతి, వాటి సంరక్షణకు సెక్యూరిటీ, నగర వాసులు దత్తత తీసుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్, జిల్లా పంచాయతీ కార్యనిర్వాహణాధికారి మహమ్మద్ హారిస్, నగర కమిషనర్ మంజునాథ్, తదితరులు కుక్కల ఆశ్రయానికి అవసరమైన స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ వీధికుక్కలను కట్టడి చేసే పనులను రెండు నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. పాఠశాలలు, దేవాలయాలు, రైల్వేస్టేషన్, బస్టాండ్ వద్ద కుక్కలను పట్టి రేబిస్, సంతానహరణ ఇంజెక్షన్లు వేయిస్తున్నామన్నారు. నగరంలోని ప్రతి కాలనీలో వీధి కుక్కలను పట్టి నగరవాసులకు భయం పోగొట్టే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. రేబిస్ లక్షణాలు ఉన్న కుక్కలు కనిపిస్తే పట్టి షెడ్‌కు తరలిస్తామని తెలిపారు. ఎవరైనా ఆసక్తి ఉంటే కుక్కల ఆశ్రయం కలిగించే స్థలానికి వచ్చి ఆహారం అందించాలని సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కుక్కలను ఒకచోటకు చేర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టామని తెలిపారు. వీధి కుక్కల నియంత్రించడానికి తాము రాజీ పడబోమని, నగర వాసులు కూడా పూర్తి సహకారం అందించాలన్నారు.
కుక్కలను పట్టి తరలిస్తాం


