అది రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం
కోలారు : కోలారు జిల్లాలో రైతుల నుంచి స్వాధీనం చేసుకున్న భూముల్లో జాయింట్ సర్వే నిర్వహించకుండానే అటవీ శాఖ అధికారులు మొక్కలను నాటే ప్రయత్నాలు చేస్తుండటం ద్వారా అటవీశాఖ అధికారులు రైతులను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని రైతు హరటి ప్రకాష్ ఆరోపించారు. శుక్రవారం నగరంలోని పాత్రికేయుల భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెలలో నిర్వహించిన కేడీపీ సమావేశంలో జిల్లా ఇంఛార్జి మంత్రి భైరతి సురేష్ ఆదేశాల ప్రకారం ఎట్టి పరిస్థితిలోను అటవీశాఖ రైతులకు ఇబ్బంది కలుగజేయరాదని తెలిపినా అకారణంగా రైతులకు అధికారులు ఇబ్బందులు కల్గిస్తున్నారని విమర్శించారు. రైతులను బెదిరించి వారి భూముల్లో మొక్కలు నాటడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. మంత్రి ఆదేశాల ప్రకారం రెవిన్యూ, అటవీశాఖ జాయింట్ సర్వే నిర్వహించాలన్నారు. బంగారుపేటె ఎమ్మెల్యే ఎస్ ఎన్ నారాయణస్వామి అసెంబ్లీ సమావేశాల్లో రైతుల పరంగా చర్చలు జరిపారు. రాబోయే రోజులలో జాయింట్ సర్వే నిర్వహించకుంటే రైతుల తరఫున భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కొన్ని చోట్ల అటవీ శాఖే ప్రభుత్వ గోమాళం భూమిని ఆక్రమించుకుందని ఆరోపించారు. దీని వల్ల చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందిపాలు అవుతున్నారన్నారు. ఆప్ జిల్లా అధ్యక్షుడు వెంకటాచలపతి, దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు దళిత నారాయణస్వామి, మంజునాథ్‌రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


