పోలియో ముక్త భారత్‌కు శ్రమించాలి
కోలారు: పోలియో ముక్త భారత్ కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని బీఈఓ గీతా పిలుపునిచ్చారు. తాలూకాలోని నరసాపుర గ్రామ పంచాయతీ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమ పూర్వసిద్దతా సమావేశంలో బీఈఓ పాల్గొని మాట్లాడారు. పొరుగు దేశాల్లో పోలియో కేసులు కనిపిస్తున్నాయని, అవి మన దేశంలో వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా పల్స్ పోలియో చుక్కల మందు వేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతగా ఈ నెల 21న పల్స్ పోలియో చుక్కల మందును 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు వేస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయంతం చేద్దామని సూచించారు. పీడీఓ మునిరాజు, ఆరోగ్య అధికారి రాఘవేంద్ర పాల్గొన్నారు.
దొంగ అరెస్ట్, బైక్‌లు స్వాధీనం
కేజీఎఫ్: కోలారు జిల్లా కేజీఎఫ్ తాలూకాలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన సీడీ రమేష్(48) అనే దొంగను కామసముద్రం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్దనుంచి రూ. 5 లక్షల విలువైన ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. తాలూకాలోని కిరుమందె గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తి తన దుకాణం ముందు బైక్‌ను నిలిపి ఉంచగా చోరీకి గురైంది. పోలీసులు గాలిస్తుండగా నిందితుడు రమేష్ పట్టుబడ్డాడు.


