
రైతుల డిమాండ్ల పరిష్కారంపై సీఎం నాటకాలు
మైసూరు : బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దేవనహళ్లి రైతుల డిమాండ్ల విషయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య నాటకాలు ఆడుతున్నారని బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరు నగరంలోని జిల్లా విలేకరుల భవనంలో కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం, దళిత సంఘర్ష సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఆయన మాట్లాడారు. ఈనెల 4వ తేదీన బెంగళూరు నగరంలో రైతు ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య సమావేశం నిర్వహించగా దేవనహళ్లి తాలూకాలోని 13 గ్రామాల్లో 1,777 ఎకరాల భూ స్వాధీనాన్ని వెనక్కు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారన్నారు. చట్టపరంగా రైతుల డిమాండ్లను పరిష్కరించడానికి ఈనెల 15వ తేదీ వరకు సమయం కోరిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇటీవలే ఢిల్లీకి వెళ్లి అక్కడ రక్షణ శాఖ, ఎయిరోస్పేస్ కారిడార్‌లను ఏర్పాటు చేయడానికి కేంద్రాన్ని అనుమతి కోరారని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో రక్షణ కారిడార్‌కు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అనుమతి అడగటం ఏ ఉద్దేశంతో అని ప్రశ్నించారు. రక్షణ శాఖ, ఎయిరో స్పేస్ కారిడార్‌కు కేంద్రం నుంచి అనుమతి లేకపోతే రైతుల నుంచి భూమిని ఎందుకు స్వాధీనం చెసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం