
బాగేపల్లి.. భాగ్యనగర
చిక్కబళ్లాపురం: బెంగళూరు రూరల్ జిల్లాను ఇక మీదట బెంగళూరు ఉత్తర జిల్లా అని పిలవాలి, అలాగే చిక్కబళ్లాపురం జిల్లాలో కర్ణాటక ముఖద్వారంగా పేరుపొందిన బాగేపల్లి పట్టణాన్ని భాగ్యనగరగా పేర్కొనాలి. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. బుధవారం ఇక్కడి ప్రముఖ పర్యాటక స్థలమైన నంది కొండపై మంత్రిమండలి సమావేశం జరిగింది. సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు తరలివచ్చారు. కొండపై సభా భవనంలో కేబినెట్ భేటీ సాగింది. తరువాత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం, మంత్రులు వివరించారు. బెంగళూరు నగర విశ్వవిద్యాలయం పేరును మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ విశ్వవిద్యాలయంగా మార్చినట్లు తెలిపారు. ఎత్తినహొళె నీటి ప్రాజెక్టును వేగవంతం చేసి మరో రెండు సంవత్సరాలలో కోలారు, చిక్కబళ్లాపురం, బెంగళూరు ఉత్తర జిల్లాకు తాగునీటిని అందిస్తామని తెలిపారు. 8 టీఎంసీలు ఏ మూలకు సరిపోతాయని విలేకరులు ప్రశ్నించగా, అన్ని వనరుల నుంచి సేకరించి అందిస్తామని సీఎం చెప్పారు.
కేసీ వ్యాలీ నీటిని తాగరాదు
కేసీ వ్యాలీ, హెచ్‌ఎన్ వ్యాలీ పథకం ద్వారా కోలారు, చిక్కబళ్లాపురం జిల్లాలలో చెరువులు, భూగర్భ జలాల వృద్ధి కోసం శుద్ధీకరించిన మురుగునీటిని వదులుతున్నారు, ఈ నీటిని ఎలా తాగాలి, ఆరోగ్య సమస్యలు వస్తాయి అని విలేకరులు ప్రస్తావించారు. జిల్లా మంత్రి ఎంసి సుధాకర్ స్పందిస్తూ, ఈ నీరు తాగడానికి కాదు, అంతర్జలాల పెంపునకు మాత్రమే అని, ఆ నీటిని వదిలే చెరువుల నీటిని తాగరాదని తెలిపారు. చిక్కబళ్లాపురంలో ఎపిఎంసి హైటెక్ పూల మార్కెట్‌ను రూ.141 కోట్ల ఖర్చులతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
బెంగళూరు రూరల్.. ఉత్తర జిల్లా
కేబినెట్ భేటీలో పేర్ల మార్పు
నంది హిల్స్ మీద సమావేశం
బెంగళూరు వర్సిటీకి మన్మోహన్‌సింగ్ పేరు
భోగనందీశ్వరుని దర్శనం
నంది హిల్స్ దిగువన ఉన్న నంది గ్రామంలో చరిత్ర ప్రసిద్ధ భోగనందీశ్వర ఆలయంలో సీఎం, మంత్రులు విశేష పూజలు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని వీక్షించి చరిత్రను తెలుసుకున్నారు. పార్వతీదేవి ఆలయం ముందు గ్రూప్ ఫోటో తీసుకొన్నారు. తరువాత విలేకరులతో మాట్లాడుతూ ఐదేళ్లూ తానే సీఎం అని, మీకు అనుమానం వద్దని సిద్దరామయ్య అన్నారు. బీజేపీ వారు పగటి కలలు కంటున్నారని అన్నారు. నందికొండలో మంత్రి మండలి సమావేశం అన్నది ఈ ప్రాంతానికి లాభం దృష్టితో చూడరాదన్నారు. రాబోయే రోజులలో బిజాపూర్ లో కేబినెట్ నిర్వహించే యోచన ఉందని చెప్పారు. సీఎం టూర్ సందర్భంగా నంది హిల్స్ కు పర్యాటకులను నిషేధించారు.

బాగేపల్లి.. భాగ్యనగర

బాగేపల్లి.. భాగ్యనగర