జోరుగా ఖరీఫ్ సాగు పనులు
హుబ్లీ: తొలకరి ముందస్తు వానలతో ధార్వాడ జిల్లాలో రైతన్నలు సాగు పనుల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ముందస్తు వానలు తెచ్చిన సంబరంతో పంట దిగుబడులపై కూడా కొండంత ఆశతో అన్నదాతలు నాగళ్లు పట్టి చలో బసవణ్ణ అంటూ ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. జిల్లాలో మార్చి నుంచి మే చివరి వరకు 113.3 మిల్లీ మీటర్ల తొలకరి ఖరీఫ్ వానలు కురుస్తాయని ఆశించగా రెట్టింపు వానలు ఇదే సమయంలో పడ్డాయి. సగటున 221.4 మిల్లీ మీటర్ల వర్షాలతో భూమి పదునుకు అవకాశం లభించింది. అదే విధంగా ఈ సారి సకాలంలో ఖరీఫ్ సీజన్ వానలు రాష్ట్రంలో ప్రవేశించడంతో అన్నదాతల్లో ఈసారి ఆశలు రెట్టింపు అయ్యాయి. దీంతో సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువుల కొనుగోలులో జోరుగా రైతన్నలు మునిగిపోయారు. రైతుల డిమాండ్‌కు అనుకూలంగా రాయితీలతో రసాయనిక ఎరువుల పంపిణీతో వ్యవసాయ శాఖ సహకారం అందిస్తోంది.
భారీగా ఎరువుల డిమాండ్
యూరియా, డీఏపీ, పొటాష్, కాంపెక్స్, ఎస్‌ఎస్‌బీతో పాటు జిల్లాకు 49,471.08 మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువుల డిమాండ్ ఉందని అంచనా. డీఏపీ ఎరువుల కొరత కొద్ది మేర ఉన్నా ఇతర సమస్యలు కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ సంయుక్త రసాయనిక ఎరువుల వాడకంపై వ్యవసాయ శాఖ రైతులకు సలహాలు ఇచ్చింది. అదే విధంగా సోయాబీన్, ఉద్దు(మినుము)లతో పాటు వివిధ పంటల విత్తనాలను రాయితీ ధరలతో పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికి 70 శాతం పైగా రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేశారు. మొత్తం 47.51 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేసుకున్నామని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ మంజునాథ అంతర్ వల్లి తెలిపారు. జిల్లాలో ఏ పంట ఎంత ప్రమాణంలో సాగు చేస్తారో అన్న దానిపై వ్యవసాయ శాఖ ఓ అంచనాకు వచ్చింది. ఈ మేరకు 2,81,595 హెక్టార్లలో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో పెసలు అత్యధికం అని చెబుతున్నారు.
పంటల సాగు విస్తీర్ణ లక్ష్యమిదే..
ధార్వాడ తాలూకాలో రైతులు సోయాబీన్, ఉద్దుల పంటల సాగుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ మేరకు పెసల పంటల 84,665 హెక్లార్లు, మొక్కజొన్న 60 వేల హెక్టార్లు, పత్తి 52 వేల హెక్టార్లు, సోయాబీన్ 34,600 హెక్టార్లు, వేరుశెనగ 20,740 హెక్టార్లు, వరిని 11 వేల హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 10–12వ తేదీ వరకు మధ్య వేగపు గాలులతో చాలా వరకు పొడి వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ధార్వాడ పశ్చిమ భాగంలో చిరుజల్లు కురవచ్చు. దీంతో మెట్ట సాగుకు భూమిని సిద్దం చేసుకొని ఉంటే మట్టితో తేమ శాతం ధృవీకరించుకొని సాగు చేయాలి. భూమి పదును లేకపోతే కలప తీసి వేత తర్వాత విత్తనం చేయాలనుకుంటే కొంత సమయం వాయిదా చేయడం మేలు. సోయాబీన్ పంటను మట్టిలో తగినంత తేమ ఉంటే మాత్రమే సాగు చేయాలని ధార్వాడ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర అనగౌడర తెలిపారు. ఈ సందర్భంగా ఆ శాఖ జేడీ మంజునాథ, జిల్లాలో సాగు లక్ష్యం, ఎరువుల డిమాండ్, అలాగే వర్షపాత వివరాలను కూడా ఆయన సమగ్రంగా వివరించారు.
ఆశించిన స్థాయికి మించి
కురిసిన వర్షాలు
చురుకుగా విత్తనం నాటే
ప్రక్రియలో రైతులు


