
సిరుగుప్పలో కాల్పుల కలకలం
సాక్షి,బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేసి తమ అదుపులో నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. గురువారం జిల్లాలోని సిరుగుప్ప పట్టణంలో పోలీసుల అదుపులో ఉన్న అమరేష్ అనే నిందితుడిని మహజరు కోసం పోలీసులు విరుపాక్షిగౌడ, మారుతీ అనే ఇద్దరు తీసుకొని వెళ్లినప్పుడు తప్పించుకునేందుకు అమరేష్ ప్రయత్నించి పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అక్కడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హనుమంతప్ప గాల్లోకి కాల్పులు జరిపి పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయినా అమరేష్ తప్పించుకునేందుకు యత్నించడంతో ఆత్మరక్షణ కోసం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అమరేష్‌పై కాల్పులు జరిపారు. దీంతో అమరేష్ కాలుకు గాయాలు కావడంతో ట్రామాకేర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, దోపిడీ దొంగ ఇద్దరికి గాయాలైన నేపథ్యంలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండటంతో ఎస్పీ శోభారాణి హుటాహుటిన ఆస్పత్రిని సందర్శించి పోలీసులతో పాటు, కాల్పుల్లో గాయపడిన వ్యక్తిని పరామర్శించారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. కాగా అమరేష్‌పై 30కి పైగా వివిధ కేసులు ఉన్నాయన్నారు. రెండు రాష్ట్రాల్లో మర్డర్, దోపిడీ, ఏటీఎం దొంగతనాలు చేసినట్లు కేసులు నమోదయ్యాయి.
దోపిడీ, హత్య నేరారోపణల వ్యక్తి పరారీ యత్నం
పోలీసులపై దాడికి యత్నించడంతో సీఐ కాల్పులు

సిరుగుప్పలో కాల్పుల కలకలం