
గిట్టుబాటు ధర చట్టం కోసం బైక్ ర్యాలీ
బళ్లారి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చట్టాన్ని రూపొందించాలని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం, హసిరు సేన రాష్ట్యాక్షుడు హుచ్చవ్వనహళ్లి మంజునాథ్ తెలిపారు. గురువారం దావణగెరె జయదేవ సర్కిల్‌లో చేపట్టిన ప్రతిఘటన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. కేంద్రప్రభుత్వం ప్రతి క్వింటాలు వరికి రూ.2320ని కనిష్టధరగా నిర్ణయించిందన్నారు. ఇందుకు ఎటువంటి చట్టబద్ధత కల్పించలేదన్నారు. కొనుగోలుదారులు, దళారులు, కంపెనీలు ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఆర్.ఎన్.ఆర్.సోనామసూరి వరి ధర రూ.1600గా ఉంది. రైతులు ఒక ఎకరానికి వరి పంట సాగుకు రూ.40 వేల నుంచి రూ.45 వేలు ఖర్చు చేస్తున్నారు. వర్షాకాలంలో సగటున ఎకరాకు 25 క్వింటాళ్లు వస్తుంది. రూ.1600 ధరలో వరి రైతుకు రూ.40 వేలు మాత్రం వస్తుంది. ఎకరాకు ప్రతి రైతు రూ.6 వేలు నష్టాన్ని భరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ మాదిరిగా ప్రతి క్వింటాలు వరికి రూ.1200లు ప్రోత్సాహధనం ఇవ్వాలని తెలిపారు. గిట్టుబాటు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసే దళారులు, కంపెనీలకు 3 నుంచి 5 ఏళ్లు జైలుశిక్ష పడేలా ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలన్నారు. ప్రతిఘటనలో భాగంగా రైతులు జయదేవ సర్కిల్ నుంచి ఏపీఎంసీ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. వచ్చే శనివారం రోడ్డులో రాకపోకలను స్తంభింపచేస్తున్నట్లు తెలిపారు. ప్రతిఘటనలో రైతు సంఘ ప్రముఖులు చిన్నసముద్రం భీమానాయక్, ఎలోదళ్లి రవికుమార్, చిక్కమల్లనహళ్లి చిరంజీవి, రాజనహట్టి రాజు, హూవినమడు నాగరాజు, చిక్కతోగలేరి నటరాజ, కెంచప్ప, నింగప్ప తదితరులు పాల్గొన్నారు.