
గుండెపోటుతో మాజీ ఎంపీ మృతి
సాక్షి,బళ్లారి: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం మాజీ లోక్‌సభ సభ్యుడు దరూరు పుల్లయ్య(95) గుండెపోటుతో మృతి చెందారు. బళ్లారి జిల్లా కంప్లి వద్ద తన పొలాలను చూసుకునేందుకు వెళ్లిన నేపథ్యంలో కారు దిగుతూ గుండెపోటుకు గురి కావడంతో ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అనంతపురం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న దరూరు పుల్లయ్య సొంత ఊరు ఉరవకొండ నియోజకవర్గంలోని ఛాయాపురం కాగా, సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. సర్పంచ్ పదవీ కాలం ముగిసిన తర్వాత 1969లో ఉరవకొండ సమితి ప్రెసిడెంట్‌గా, అనంతరం కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పని చేస్తుండటంతో ఇందిరాగాంధీ ఆశీస్సులతో 1977లో అనూహ్య పరిణామాలతో అనంతపురం లోక్‌సభ సభ్యునిగా కాంగ్రెస్ టికెట్ సంపాదించారు. 1977 నుంచి 1979 వరకు రెండేళ్ల పాటు లోక్‌సభ సభ్యునిగా సేవలందించారు. అనంతరం 1982 నుంచి 1985 వరకు రెండోసారి అనంతపురం లోక్‌సభ సభ్యునిగా కొనసాగారు.
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
అప్పట్లో అనంతపురం జిల్లా కాంగ్రెస్‌లో గొప్ప నాయకుడుగా, జిల్లాలో రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు చేయడంలో దరూరు పుల్లయ్య తనదైన పాత్ర పోషించారు. ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గ రాజకీయాల్లో, అభివృద్ధి చేయడంతో దరూరు పుల్లయ్య చిరస్థాయిగా నిలిచిపోయారు. హంద్రీనీవా సాధించుకోవడానికి ఆయన చేసిన కృషిని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటారు. సొంతూరు ఛాయాపురం అభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. సాగు, తాగునీరు సాధించుకోవడానికి కృషి చేశారని గుర్తు చేసుకుంటున్నారు. ఆయనకు భార్య సత్యవతమ్మ కుమారుడు రమేష్, కోడలు నీలిమ, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. అనంతపురం రాజకీయాల్లో, రైతుగా గుర్తింపు పొందిన ఆయనకు బళ్లారితో కూడా విడదీయరాని అనుబంధం ఉంది. బళ్లారిలో సొంత ఇల్లుతో పాటు, వ్యాపారాలు, వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే స్థిరపడ్డారు. ఆయన మృతి వార్త తెలుసుకుని వైఎస్సార్‌సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి బళ్లారికి వచ్చి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దరూరు పుల్లయ్య మృతి తీరని లోటు అని, ఆయన రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు చేశారని కొనియాడారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో హంద్రీనీవా పథకాన్ని సాధించడానికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. బళ్లారి నగర మేయర్ ముల్లంగి నందీష్ తదితరులు కూడా నివాళులు అర్పించారు.
పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి,
సంతాపం
హంద్రీనీవా పథకం సాధనలో
పుల్లయ్య పాత్ర మరవలేనిది
వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు,
ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి

గుండెపోటుతో మాజీ ఎంపీ మృతి