విలేకరిపై దాడి.. అటవీ సిబ్బంది సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

విలేకరిపై దాడి.. అటవీ సిబ్బంది సస్పెన్షన్‌

Apr 19 2025 9:34 AM | Updated on Apr 19 2025 9:34 AM

విలేక

విలేకరిపై దాడి.. అటవీ సిబ్బంది సస్పెన్షన్‌

హుబ్లీ: బీదర్‌లో వార్తల సేకరణకు వెళ్లిన విలేకరి రవి బసవరాజ బాసుండేపై దాడి చేసిన అటవీ శాఖ సిబ్బంది దస్తగిరి సాబ్‌ను ఉప అటవీ సంరక్షణ అధికారి సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలను వెల్లడించారు. సదరు అటవీ శాఖ ఉద్యోగి దస్తగిరి సాబ్‌ విధి నిర్వహణ వేళ ప్రజలతో వినయ విధేయతలు చూపకుండా ఇష్టమొచ్చిన రీతిలో నడుచుకుంటున్నారన్న ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టి నిజాలు వెల్లడి కావడంతో నిష్పక్షపాతంగా ఈ సస్పెన్షన్‌ చర్య తీసుకున్నారు. ఈ నెల 15న బీదర్‌ నగరంలో విలేకరిపై అటవీ సిబ్బంది దాడి గురించి క్రమశిక్షణ చర్యలు తీసుకుని నివేదికను ఇవ్వాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే ఆదేశించారు. విలేకరిపై దాడిని ఖండించిన కేయూడబ్ల్యూజే ఈ విషయంలో బాధ్యులపై చర్యకు డిమాండ్‌ చేస్తూ బీదర్‌లో విలేకరుల సంఘం ఆందోళన చేపట్టింది. ఎట్టకేలకు బాధ్యుడిపై సస్పెన్షన్‌ వేటు వేసినందుకు కేయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు శివానంద తగడూరు మాట్లాడుతూ విలేకరుల పోరాటానికి స్పందన లభించిందన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందేనని అన్నారు.

అబద్ధాలతో సర్కారు కాలయాపన

హుబ్లీ: రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం అబద్ధాలు చెప్పి కాలయాపన చేస్తోందని రైతు నేత కోడిహళ్లి చంద్రశేఖర్‌ మండిపడ్డారు. ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ యడియూరప్ప గతంలో వ్యవసాయ చట్టాన్ని చేసి భూమిని రైతులు కాని వారికి ఇచ్చే చట్టం తెచ్చారన్నారు. దీన్ని అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రద్దు చేస్తామని సిద్దరామయ్య హామీ ఇచ్చారన్నారు. అదే విధంగా ఏపీఎంసీ చట్టాన్ని కూడా రద్దు చేస్తామన్నారు. అయినా ఈ కీలక అంశంపై సిద్దరామయ్య ఇప్పటికీ మాట్లాడటం లేదన్నారు. కాంగ్రెస్‌ కేవలం మత రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఇలాంటి రాజకీయాలు చేయడం నీచ సంస్కృతి అన్నారు. పేద దళితులను గుర్తించడం విడిచి వేరే దారిలో సర్కారు సాగుతోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌లకు ప్రత్యామ్న్యాయ పార్టీ ఏర్పాటుపై చింతన సమావేశంలో చర్చ జరిపామన్నారు. ఈ విషయమై జనతా ప్రణాళిక రూపొందించామన్నారు. కొత్తగా రైతుల పార్టీని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో త్వరలోనే ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

మహిళలు స్వశక్తితో రాణించాలి

రాయచూరు రూరల్‌: నేటి ఆధునిక యుగంలో సమాజానికి తగ్గట్లు మహిళలు కఠిన పరిశ్రమతో స్వశక్తితో రాణించాలని ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ అధ్యక్షురాలు సుష్మా పతంగి పిలుపునిచ్చారు. నగరంలోని ప్రైవేట్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆమె మహిళలకు టైలరింగ్‌ మిషన్లు పంపిణీ చేసి మాట్లాడారు. స్వశఽక్తితో జీవితాన్ని నడపడానికి నేడు అన్ని విధాలుగా అవకాశాలున్నాయన్నారు. సమాజానికి ఉపయోగ పడే విధంగా సేవలు అందించాలన్నారు. లలిత, అనితా, భ్రమరాంబ, రత్నమాల, శ్రీదేవి, ఇందిర, ప్రతిభ, ప్రమోద్‌, లతాలున్నారు.

ముంగారు ఉత్సవాలకు

కేంద్ర మంత్రికి ఆహ్వానం

రాయచూరు రూరల్‌: నగరంలో జూన్‌ నెలలో ఐదు రోజుల పాటు ముంగారు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలసి విన్నవించుకున్నారు. జూన్‌ 8 నుంచి 12 వరకు ముంగారు మున్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో ముంగారు సాంస్కృతిక ఉత్సవాలను చేపట్టడానికి సమాజం సిద్ధంగా ఉందన్నారు. ముంగారు సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభించి 25 ఏళ్లు కానున్న సందర్భంగా ఉత్సవాలకు రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు.

వైభవంగా మహంతేశ్వర రథోత్సవం

రాయచూరు రూరల్‌: తాలూకాలోని బిచ్చాలి గ్రామంలో గురువారం సాయంత్రం మహాంతేశ్వర మహాలింగ స్వామీజీ రథోత్సవం వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. ఆలయంలో బిచ్చాలి మఠాధిపతి వీరభద్ర శివాచార్య, శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, వీర సోమేశ్వర, పంచాక్షరి స్వామీజీలు ప్రత్యేక పూజలు నెరవేర్చారు. రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విలేకరిపై దాడి..  అటవీ సిబ్బంది సస్పెన్షన్‌  1
1/2

విలేకరిపై దాడి.. అటవీ సిబ్బంది సస్పెన్షన్‌

విలేకరిపై దాడి..  అటవీ సిబ్బంది సస్పెన్షన్‌  2
2/2

విలేకరిపై దాడి.. అటవీ సిబ్బంది సస్పెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement