చక్రస్నానం అనంతరం శ్రీవారి దర్శనం
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన శ్రీవారి చక్రస్నానం(తీర్థవాది)సోమవారం భక్తుల కోలాహలం మధ్య వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భృగుతీర్థం(కోనేరు)లో పుణ్యస్నానాలు ఆచరించారు. పక్షం రోజుల పాటు సాగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతమై లోకం క్షేమంగా ఉండటానికి, భక్తులు సుఖశాంతులతో ఉండేందుకు చక్రస్నానం నిర్వహిస్తామని అర్చక పండితులు వివరించారు. ‘ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవభృథ స్నానం చేస్తారు. యజ్ఞ నిర్వహణలో జరిగిన చిన్న చిన్న లోపాల వల్ల ఏర్పడే దుష్ఫరిణామాలు తొలగి, అందరికీ మంచి జరగాలని ఇలా చేస్తాము’ అని అర్చకులు పేర్కొన్నారు. చక్రస్నానంలో శ్రీవారి సుదర్శన చక్రానికి భృగుతీర్థంలో స్నానం నిర్వహించే ముందు శ్రీదేవి, భూదేవి సమేత నారసింహుడికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. తర్వాత పవిత్ర పుష్కరిణిలో ముంచి స్నానం చేయించారు. ఆ దివ్యాయుధ స్పర్శ కోసం పుష్కరిణి జలంతో భక్త జనులు స్నానమాచరించారు.
ధ్వజావరోహణం: ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు సకల దేవతా మూర్తులను ఆహ్వానించేందుకు బ్రహ్మోత్సవాల ప్రారంభం నాడు ఆలయ ప్రాంగణంలో అర్చకులు ధ్వజారోహణం గావించిన విషయం తెలిసిందే. ఆ రోజు ఒక కొత్త వస్త్రాన్ని తెచ్చి దానిపై శ్రీవారి వాహనమైన గరుడ బొమ్మను చిత్రీకరించారు. దాన్ని గరుడ ధ్వజ పటం అంటారు. దాన్ని ధ్వజ స్తంభం మీద కట్టి పైకి ఎగుర వేశారు. పక్షం రోజుల పాటు గాలిలో ఎగిరిన ఈ గరుడ పతాకమే సకల దేవతలకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రం. ఈ ఆహ్వానాన్ని అందుకొని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసి కదిరి కొండపై నుంచి తిలకిస్తారని బ్రహ్మాండ పురాణంలో పేర్కొన్నారు. ఆ ధ్వజపటాన్ని శ్రీవారి చక్రస్నానం అనంతరం ఽఅవరోహనం గావించారు. దీన్నే కదిరి ప్రాంతంలో కంకణాలు విప్పడం అంటారు. ధ్వజావరోహణంతో ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలికినట్లయిందని ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు తెలియజేశారు.
మధ్య్యాహ్నం నుంచి ఆలయం మూత: బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణం నాటి నుండి తీర్థవాది వరకూ స్వామి వారు యాగశాల లోనే గడిపారు. తీర్థవాది ముగించుకొని సోమవారం స్వామివారు తిరిగి ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో సాయంత్రం మధ్యాహ్నం నుంచి ఆలయం తలుపులు మూసివేశారు. తర్వాత భక్తులకు ఆలయంలో శ్రీవారి దర్శనం లేదు. తిరిగి మంగళవారం(నేటి) ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు. ఎప్పటిలాగానే శ్రీవారు ఆలయంలో యధాప్రకారం పూజలు అందుకొని భక్తులకు దర్శనమిస్తారు.
సుదర్శన చక్రంకు చక్రస్నానం
ధ్వజావరోహనం చేస్తున్న అర్చక పండితులు


