
పట్టుబడిన మినీ లారీ
మైసూరు: కేరళలో ప్రమాదకర నిఫా వైరస్ వ్యాప్తి చెందడంతో సరిహద్దు జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. అయితే కేరళలో ఆస్పత్రుల్లోని వైద్య వ్యర్థాలను తెచ్చి మైసూరు జిల్లా సరిహద్దుల్లోని నిర్జన ప్రాంతాల్లో పడేస్తున్నారని స్థానిక ప్రజలు, అధికారులు మండిపడ్డారు. రాత్రివేళ లారీల్లో తెచ్చి గుట్టుగా పడేసి వెళ్తున్నారని తెలిపారు. నంజనగూడు రోడ్డులోని కడకోళ పారిశ్రామిక ప్రాంతంలో ఇలాగే ఒక మినీ లారీలో వైద్య వ్యర్థాలను తెచ్చి పడేస్తుండగా మైసూరు లారీ యజమానుల సంఘం సభ్యులు గుర్తించి డ్రైవర్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
దుర్వాసన రావడంతో
లారీ టార్పాలిన్ కప్పుకుని వెళ్తుండగా అందులో నుంచి ఔషధ, ఇతర దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి దానిని నిలిపి పరిశీలించగా వైద్య వ్యర్థాలు కనిపించాయి. డ్రైవర్‌ని గట్టిగా ప్రశ్నించగా కేరళ ఆస్పత్రుల్లో పోగవుతున్న చెత్తను పడేయమని పంపినట్లు తెలిపాడు. కడకోళ చెక్‌పోస్టును దాటుకుని ఇటువంటి లారీలు ఎలా వస్తున్నాయని అనుమానాలున్నాయి. వీరికి స్థానికంగా ఎవరో సహకరిస్తున్నారని సమాచారం. మైసూరు నగర సమీపంలోనే లారీ దొరకడంతో స్థానికుల్లో కలవరం నెలకొంది. ఈ తతంగం చాలాకాలం నుంచి జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత నెలలోనూ ఒక లారీ పట్టుబడగా విచారణ జరిపి వదిలేశారు. ఇలాంటి పనుల వల్ల జిల్లాలో కూడా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. పోలీసులు లారీ డ్రైవర్‌ను విచారణ చేపట్టారు.
నగర శివార్లలో గుట్టుగా డంపింగ్
ఒక లారీ పట్టివేత