
కెలమంగలం: ఆస్తి తగాదాల్లో ఏర్పడిన గొడవల్లో రైతుపై దాడి చేసిన అన్నదమ్ములను అంచెట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు అంచెట్టి తాలూకా ఉరిగం గ్రామానికి చెందిన రైతు నిరంజన్ (31). అదే ప్రాంతానికి చెందిన ముత్తురాజ్ (39)తో ఆస్తి తగాదాలున్నాయి. బుధవారం వీరి మధ్య ఏర్పడిన గొడవల్లో ఆవేశం చెందిన ముత్తురాజ్, అతని సోదరుడు రంగముత్తు (43)లు కలిసి నిరంజన్‌పై దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు అంచెట్టి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ అన్నదమ్ములను అరెస్ట్ చేశారు.
వార్డులో మేయర్ పర్యటన
హోసూరు: హోసూరు కార్పొరేషన్ పరిధిలోని 23వ వార్డులో మేయర్ సత్య పర్యటించారు. అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని పాత ఏఎస్‌టీసీ హడ్కో ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, వార్డులో మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఈ విషయంపై స్పందించిన మేయర్ నేరుగా వెళ్లి పరిశీలించారు. సమస్యలను ఆలకించి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎల్లోరామణి, సురేష్, సుధా నాగరాజ్, సుందర్, రమేశ్, జయశీలన్, శేఖర్, గణే ష్‌మూర్తి తదితరులు పాల్గొన్నారు.
పథకాల ఆకస్మిక తనిఖీ
హోసూరు: హోసూరు కార్పొరేషన్‌లో జిల్లా పరిశీలకురాలు బీలా రాజేష్ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శరయు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మొదటగా హోసూరు– బాగలూరు రోడ్డులోని కేసీసీ నగర్‌లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపాన్ని, సమత్వపురంలోని సముదాయ భవనాన్ని పరిశీలించారు. అనంతరం సమత్వపురం ప్రాథమిక పాఠశాలలో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అల్పాహార పథక పనులను పరిశీలించారు. కామనదొడ్డి, బయనపల్లి ప్రాంతాల్లో పర్యటించి తరువాత కలెక్టరేట్‌లో అన్ని శాఖల అఽధికార్లతో సమావేశమయ్యారు. అభివృద్ధి పథకాలను సక్రమంగా అమలు చేయాలని తెలిపారు.
అటవీ అధికారులతో మంత్రి సమావేశం
బొమ్మనహళ్లి: అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే గురువారం అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ ఏడాది వన మహోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు కోట్ల మొక్కలు నాటారని, అందులో ఎన్ని మొక్కలు జీవంతో ఉన్నాయో లెక్కలు చెప్పాలని అన్నారు. మండ్య, కొప్పలు జిల్లాలు అనుకున్న లక్ష్యాలు సాధించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో ఐదు కోట్ల మొక్కలు నాటుతామన్నారు.