
గౌరిబిదనూరు: గౌరిబిదనూరు తాలూకా అలకాపురంలో షానవాజ్ (30) అనే మహిళను భర్త అంజుంఖాన్ హత్య చేశాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. పుట్టపర్తి జిల్లాలోని హిందూపురానికి చెందిన అంజుంఖాన్ (33), షానవాజ్‌లకు 8 ఏళ్ల కిందట పెళ్లయింది, ఆరేడేళ్ల కిందట ఉపాధి కోసం అలకాపురానికి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే ఒక ఫ్యాక్టరీలో కూలీ పనులకు వెళ్లేవారు. వీరికి పిల్లలు లేరు.
కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఎస్‌డిఎం వైనరీ సమీపంలో గొడవ పడిన భర్త చాకుతో భార్య గొంతుకోసి హత్య చేశాడు. తరువాత గౌరిబిదనూరు రూరల్ స్టేషనుకు వెళ్లి లొంగిపోయాడు. మంచేనహళ్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హిందూపురంలో ఉన్న హతురాలి అన్న జబీవుల్లాకు సమాచారమందించారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అంజుంఖాన్‌ని అరెస్టు చేశారు.