
దొడ్డ సరిహద్దులో ఏర్పాటు చేసిన హైటెక్ చెక్‌పోస్టు
మైసూరు: భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న విషయాన్ని భార్య ప్రశ్నించగా ఆమెను కిరాతకంగా చంపాడు. ఈ సంఘటన చామరాజనగర తాలూకాలోని ముడ్నాకూడు గ్రామంలో జరిగింది. వివరాలు.. ఏసీ సౌమ్య(27), మహేష్ చంద్రగురు భార్యాభర్తలు. ఏడేళ్ల కిందట పెళ్లి జరగ్గా, ఐదేళ్ల కుమార్తె ఉంది. భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలిసి సౌమ్య తరచూ గొడవపడేది. పెద్దలు వారికి సర్దిచెప్పేవారు. అక్రమ సంబంధం మానుకోమని పెద్దలు చెప్పినా మహేష్‌లో మార్పు రాలేదు. సోమవారం ఇదే విషయమై భార్య గట్టిగా నిలదీయడంతో కోపోద్రిక్తుడైన మహేష్ కట్టె తీసుకుని భార్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి దుండగున్ని అరెస్టు చేశారు.
ట్రాన్స్‌జెండర్లకు ఎన్నికల గుర్తింపు కార్డులు
మైసూరు: మైసూరు జిల్లాలో 212 మంది ట్రాన్స్‌జెండర్లు ఓటు హక్కు కలిగి ఉన్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ కేవీ రాజేంద్ర తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా పంచాయతీ సమావేశం హాల్లో ట్రాన్స్‌జెండర్లకు ఓటరు గుర్తింపు కార్డులను అందజేసి మాట్లాడారు. ఓటు హక్కు ఎంతో అమూల్యమైనదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
5న కోలారులో రాహుల్‌గాంధీ సభ ?
శివాజీనగర: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఏప్రిల్ 5న కర్ణాటకకు రానున్నారు. కోలార్‌లో కాంగ్రెస్ నిర్వహించే భారీ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కోలారులోనే గతంలో మోదీ అనే ఇంటిపేరున్నవారే ఎక్కువగా దొంగలుగా ఉన్నారని ఆయన ఆరోపించడం, ఇదే కేసులో గుజరాత్‌లో పరువు నష్టం దావాలో రెండేళ్ల జైలుశిక్ష, ఆపై ఎంపీ సభ్యత్వం రద్దు కావడం తెలిసిన విషయాలే. దీనిని ఖండిస్తూ ఆ రోజు ప్రసంగం చేసిన స్థలంలోనే మళ్లీ రాహుల్ సభ జరపాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు.
ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెండ్
బనశంకరి: సీఐపై ఆరోపణలు చేసి రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాసిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. బెంగళూరు సుబ్రమణ్యనగర పోలీస్ స్టేషన్ సీఐ శరణగౌడ, పబ్, బార్‌ల నుంచి మామూళ్లు తీసుకుంటున్నానని ఇద్దరు కానిస్టేబుళ్లు ఏకంగా రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి లేఖ రాశారు. అయితే ప్రాథమిక విచారణలో ఇది పూర్తి అబ్ధమని తేలడంతో కానిస్టేబుల్స్ శివకుమార్, విజయ్‌రాథోడ్‌ను సస్పెండ్ చేశారు. మల్లేశ్వరం పోలీస్‌స్టేషన్ ఏసీపీ నేతృత్వంలో విచారణ చేపట్టారు.
ఓలేకార్‌పై అనర్హత వేటు వేయండి
యశవంతపుర: క్రిమినల్ కేసులో రెండేళ్లపాటు జైలుశిక్ష పడిన బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకార్‌పై కూడా అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ హావేరికి చెందిన బీజేపీ కార్యకర్త సం తోష్‌రెడ్డి గవర్నర్, శాసనసభ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. నెహ్రూ ఓలేకార్‌ను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీఎం, బీజేపీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 13న ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని ఆయన ఫిర్యాదులో జత పరిచారు.
దొడ్డ సరిహద్దులో
హైటెక్ చెక్‌పోస్టులు
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దొడ్డ తాలూకా సరిహద్దుల్లో వాహనాల తనిఖీ, అక్రమ రవాణాలను అరికట్టేందుకు ఈసారి హైటెక్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. దొడ్డ తాలూకాలో ఆరు చోట్ల ఇలాంటి చెక్‌పోస్టులు తెరిచారు. హొసహుడ్య క్రాస్, చిక్కబెళవంగల పాఠశాల ముందు, ఆరూడి కనసవాడి రోడ్డులోని దొడ్డబెళవంగల క్రాస్ వద్ద, కేసీపీ కల్యాణ మండపం సర్కిల్, రాజఘట్ట గ్రామం వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. గతంలో పెండాళ్లతో చెక్‌పోస్టు నిర్మించేవారు. దీంతో చెక్‌పోస్టు సిబ్బంది వర్షం, గాలికి తీవ్ర ఇబ్బందులు పడేవారు. అయితే ఈసారి గాలి, వానకు తట్టుకునే టార్పాల్‌తో చెక్‌పోస్టు నిర్మించారు. రాత్రిపూట కూడా వాహనాల తనిఖీ కోసం చుట్టూ లైట్లు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను అమర్చారు.
