
యశవంతపుర: మంగళూరులో ఐస్‌క్రీం గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రూ. కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది. నగర సమీపంలోని అడ్యార్‌లో సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. గోడౌన్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
బాలుడి అపహరణకు యత్నం
యశవంతపుర: రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారిని అపహరించడానికి యత్నించిన ఘటన చిక్కమగళూరు నగరంలో జరిగింది. త్రుటిలో బాలుడు తప్పించుకున్నాడు. ఆదివారం సాయంత్రం పొద్దుపోయిన తరువాత ఇక్కడి ఎంజీ రోడ్ ఫుట్‌పాత్‌పై కొందరు బాలురు ఆడుకుంటున్నారు. అటుగా వచ్చిన ఓ వ్యక్తి ఆడుకుంటున్న ఓ బాలుడిని ఎత్తుకోవడానికి యత్నించాడు. బాలుడు భయపడకుండా చాకచక్యంగా తప్పించుకున్నారు. బాలుడి సాహసం, తెగువను చిక్కమగళూరు ప్రజలు ప్రశంసిస్తున్నారు.
సబ్ రిజిస్ట్రార్‌కు నాలుగేళ్ల జైలు
మైసూరు: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ నమోదైన కేసులో మైసూరు ఉత్తర విభాగం సబ్ రిజిస్ట్రార్ గిరీశ్‌కు ఇక్కడి కోర్టు నాలుగేళ్ల జైలు, రూ. 2 లక్షల జరిమానా విధించింది. గురుమంటెస్వామి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సబ్ రిజిస్ట్రార్‌పై 2014 ఏప్రిల్‌లో కేసు నమోదైంది. లోకాయుక్త పోలీసులు దర్యాప్తు చేసి 77 పేజీలతో నివేదికను లోకాయుక్త కోర్టుకు సమర్పించారు. విచారణలో భాగంగా 13 మంది సాక్షులను కూడా విచారణ చేశారు. ఆధారాలు రుజుకావడంతో లోకాయుక్త ప్రత్యేక న్యాయమూర్తి భాగ్య దోషికి నాలుగేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
అరవింద లింబావళిని గెలిపించాలి
కృష్ణరాజపురం: మహాదేవపుర ఎమ్మెల్యే, మాజీ మంత్రి అరవింద లింబావళి ఆధ్వర్యంలో 2018 నుంచి 2023 వరకు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను పుస్తకంగా ముద్రించి కార్యకర్తలు ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి అరవింద లింబావళిని గెలిపించాలని కోరుతున్నారు.