● భార్య దారుణహత్య
క్రిష్ణగిరి: భార్య నడతపై అనుమానించిన భర్త ఆమెను దారుణంగా హతమార్చిన ఘటన సూళగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు... సూళగిరి తాలూకా మాదరసనపల్లి సమీపంలోని సెమ్మనగుళి గ్రామానికి చెందిన కార్మికుడు రంజిత్ (30), రోజా (29) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. భార్యపై ఇటీవల అనుమానం పెంచుకున్న రంజిత్ తరచూ ఆమెతో గొడవపడేవాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన రోజా కొద్ది రోజుల క్రితం తన పుట్టినింటికి వెళ్లిపోయింది. సోమవారం భార్య ఇంటికి వచ్చిన రంజిత్ ఆమెను సముదాయించి మరుసటిరోజు ఇంటికి తీసుకువచ్చాడు. అదే రోజు రాత్రి మళ్లి గొడవ జరిగింది. తీవ్ర ఆవేశంతో రంజిత్ సుత్తితో భార్య తలపై బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.
రోడ్డు ప్రమాదంలో వ్యాపారి మృతి
హోసూరు: రెండు ద్విచక్ర వాహనాలు నేరుగా ఢీకొన్న ప్రమాదంలో జౌళి వ్యాపారి మృతి చెందిన ఘటన మత్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు...క్రిష్ణగిరి జిల్లా మత్తూరు సమీపంలోని మాడరహళ్లి గ్రామానికి చెందిన జౌళి వ్యాపారి క్రిష్ణమూర్తి (45) సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన క్రిష్ణమూర్తిని స్థానికులు చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.