‘కిక్కు’లో పల్లెలు
ఏరులై పారుతున్న మద్యం
పెద్దమనుషులకు దావత్‌లు
అనుచరులకు విస్కీ క్వార్టర్లు
గ్రామాల్లో యథేచ్ఛగా బెల్ట్‌దందా
కోడ్ అమలులో ఉన్నా అతిక్రమణ
పొలం పనులకు వెళ్లకముందే తమ అనుచరులతో కలిసి పొద్దున్నే ఇంటింటి ప్రచారం చేస్తున్న అభ్యర్థులు.. ఓటర్లకు టీలు, టిఫిన్‌లు అందిస్తున్నారు. దూరప్రాంతంలోని వారిని మధ్యాహ్నం ఫోన్‌లో సంప్రదిస్తున్నారు. పొలం పనులు ముగించుకొని వచ్చాక సాయంత్రం మరోసారి కలుస్తున్నారు. రోజంతా తమతో తిరిగిన అనుచురులకు చీకటిపడగానే క్వార్టర్ బాటిల్ అప్పగిస్తున్నారు. రోజుకో కులసంఘం పెద్దతో దావత్ ఏర్పాటు చేయించి చల్లబరుస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిననాటి నుంచి మద్యం ఏరులైపారుతుండడంతో పల్లెలు మద్యం కిక్కులో తూలుతున్నాయి. రోజూ చీఫ్ లిక్కర్ తాగేవాళ్లు కూడా ఎన్నికల సందర్భంగా బ్రాండ్ మార్చుతున్నారు. అభ్యర్థుల ఖర్చు తడిసి మోపెడవుతోంది.
సాక్షి పెద్దపల్లి: పల్లెల్లో ఎక్కడచూసినా ఓట్ల పండుగ సందడి చేస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా జిల్లాలో బెల్ట్‌షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్న పల్లె, పట్నం అనే తేడా లేకుండా బెల్ట్‌షాపుల్లో మద్యం ఏరులై పారుతోంది. ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే బెల్ట్‌షాపులపై ఉక్కుపాదం మోపుతారు. కానీ, కోడ్ అమలులోకి వచ్చి పదిరోజులు గడిచినా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యువతకు కాటన్ల కొద్దీ బీర్లు, వృద్ధులు, పెద్దమనుషులకు మండువాల్లో తెల్లకల్లు పంపిణీ చేస్తున్నారు. రాత్రివేళ కులసంఘాల పెద్దలతో దావత్‌లు జోరుగా సాగిస్తున్నారు.
ఖర్చుకు వెనుకాడడం లేదు..
పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారం కన్నా ప్రలోభాలకే ఆసక్తి చూపుతున్నారు. ప్రచారానికి ఖర్చు చేయడంకన్నా ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు ఎంతవరకై నా వెనుకాడడంలేదు. గతంలో ఎన్నికలకు ఒకరోజు ముందు క్వార్టర్ లేదా హాఫ్ బాటిల్ లిక్కర్‌ను ఓటర్ల ఇళ్లకు పంపించేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే ఊరురా మందు పార్టీలు మొదలయ్యాయి. ఎలగైనా గెలవాలనే కసితో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటాపోటీగా లిక్కర్ కొనుగోలుచేసి పంచుతున్నారు. దీనికితోడు ప్రచారంలో పాల్గొన్న వారందరికీ చుక్క, ముక్కతో విదులు ఏర్పాటు చేస్తున్నారు. మద్యం పంపిణీకి గ్రామంలోని బెల్ట్‌షాపుల వారితో ఒప్పందాలు చేసుకుంటున్నారు. మరికొందరు నేరుగా వైన్స్ నుంచి పెద్దమొత్తంలో కొనుగోలు చేసి లిక్కర్‌ను తమ అనుచరుల వద్ద స్టాక్ పెట్టించి రాత్రిపూట పంపిణీ చేయిస్తున్నారు.
బహిరంగంగానే తరలింపు
రోడ్లపై వాహనాలను తనిఖీ చేస్తూ నగదు, తదితరాలను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తే సీజ్‌చేసే అధికార యంత్రాంగం.. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా అవుతున్నా.. ఎందుకు ఫోకస్ చేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో పరిమితంగానే మద్యం తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వైన్స్‌ల నుంచి మద్యం, బీర్లు బహిరంగంగానే మారుమూల ప్రాంతాల్లోని బెల్ట్ షాపులకు తరలిస్తూ 24గంటలు మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. అయినా.. అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
‘కిక్కు’లో పల్లెలు


