డీఎంఈ పరిధిలోకి వెల్‌నెస్
వైద్య సేవలు మెరుగుపరుస్తాం
అందుబాటులోకి అదనపు వైద్య సేవలు
ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు ప్రయోజనం
స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి చర్యలు చేపట్టిన జీజీహెచ్
అదనంగా ఆర్థో, జనరల్ ఫిజీషియన్, డెర్మటాలజీ చికిత్స
కరీంనగర్: ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు నగదురహిత వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం 2018లో కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రి ఆవరణలో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేసింది. ప్రారంభం నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యసేవలు అందించిన దాఖలాలు లేవు. వైద్యుల గైర్హాజరు, మందుల కొరతతో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇకనుంచి ఆ సమస్యకు చెక్ పడనుంది. ఇది వరకు వెల్‌నెస్ సెంటర్ ఆరోగ్యశ్రీ సీఈవో పరిధిలో కొనసాగేది. ఇక నుంచి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోకి వచ్చింది. కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) నుంచి వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విషయమై డీఎంఈ నుంచి జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు కలిపి దాదాపు 10 వేల మందికి పైగా ఉంటారు. వెల్‌నెస్ సెంటర్‌కు వెళ్లినా వైద్యసేవలు అందక తిరిగి వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పెన్షనర్లకు బీపీ, షుగర్ తదితర మందులు లేక ఇబ్బందులు పడ్డారు. ఇకనుంచి ఆ అవస్థలు తీరనున్నట్లు తెలుస్తోంది.
ఆర్థో, జనరల్ ఫిజీషియన్, డెర్మటాలజీ సేవలు
వెల్‌నెస్ సెంటర్‌లో ప్రస్తుతం ముగ్గురు ఎంబీబీఎస్ వైద్యులు, నలుగురు డెంటిస్టులు పనిచేస్తున్నారు. ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఇద్దరు డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇద్దరు ఫార్మసిస్టులు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఇక నుంచి ఈ సెంటర్‌లో ప్రస్తుతం ఉన్న ముగ్గురు ఎంబీబీఎస్‌లు, నలుగురు డెంటిస్టులతో పాటు కొత్తగా ఆర్థోపెడిక్, జనరల్ ఫిజీషియన్, డెర్మటాలజిస్టు వైద్యుల ద్వారా సేవలు అందించనున్నారు. దీంతోపాటు అన్ని రకాల రోగనిర్ధారణ పరీక్షలు సైతం చేపట్టనున్నారు. ప్రతిరోజు వెల్‌నెస్ సెంటర్‌కు 100కు పైగా పేషెంట్లు వస్తున్నారు. స్పెషలిస్ట్ వైద్యులు లేకపోవడంతో చాలా మంది ఇక్కడ వైద్యసేవలు పొందలేక పోతున్నారు. ఈ సేవలు ప్రారంభిస్తే వెల్‌నెస్ సెంటర్ కిటకిటలాడనుంది.
ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు వెల్‌నెస్ సెంటర్‌లో వైద్యసేవలు అందించడం జరుగుతుంది. ఇది వరకు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉండగా, ఇటీవలే డీఎంఈ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. మెడికల్ కళాశాల అనుబంధ జీజీహెచ్ ద్వారా వెల్‌నెస్ సెంటర్‌లో మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపడతాం. ఇప్పుడున్న వైద్యులకు తోడుగా అదనంగా ఆర్థో, జనరల్ ఫిజీషియన్, డెర్మటాలజీ వైద్యులను నియమిస్తాం. రోస్టర్ ప్రకారం వారు సేవలు అందిస్తారు.
– వీరారెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్


