వలస కార్మికుల భద్రతపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి
జగిత్యాలరూరల్: భారతీయ వలస కార్మికుల భద్రతపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఎన్‌ఆర్‌ఐ అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి అన్నారు. గురువారం ఢిల్లీలో ఓవర్సిస్ మొబిలిటి బిల్ ప్రవాసీల హక్కులు కాపాడాలని తెలంగాణ ప్రభుత్వ ఎన్‌ఆర్‌ఐ అడ్వయిజరీ కమిటీ సభ్యులు చెల్లమనేని శ్రీనివాస్‌తో కలిసి రాష్ట్ర ఎంపీలకు వినతిపత్రం సమర్పించారు. 42 ఏళ్లుగా అమలులో ఉన్న ఇమిగ్రేషన్ యాక్ట్ 1983 స్థానంలో భారత ప్రభుత్వం కొత్త చట్టం చేయనున్న నేపథ్యంలో విదేశీ మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎంపీ డీకే.అరుణ, బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్.సురేశ్, కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, సురేశ్ శెట్కర్, కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ మధుయాష్కిలతో చర్చించారు. భారతీయ వలస కార్మికులు విదేశాల్లో గౌరవంగా, భద్రతతో నివసించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
హుజూరాబాద్‌రూరల్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన కొక్కొండ అభినయ్ నందన్(19) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన కొక్కొండ రమేశ్ కొడుకు అభినయ్ నందన్ హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం ఇంట్లోని బాత్‌రూంలో ఉరేసుకున్నాడు. తండ్రి గమనించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. తన కొడుకు చదువులో వెనకబడి, మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని రమేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి
వేములవాడఅర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లా వే ములవాడ మండలం చింతాల్‌ఠాణాకు చెందిన సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి(50) గుండెపోటుతో గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. మురళి బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి. గురువారం రాత్రి 7 గంటల వరకు కత్తెరగుర్తుకు ఓటేయాలని కోరుతూ గ్రామంలో ప్రచారం చేశారు. రాత్రి 11 గంటల సమయంలో గుండెలో నొప్పిగా ఉందని, వేములవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి బైక్‌పై వెళ్లారు. పరీక్షించిన వైద్యులు కరీంనగర్ వెళ్లాలని సూచించారు. అంబులెన్స్‌లో వెళ్తూ పరిస్థితి విషమించడంతో వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మురళికి కుమారుడు ఆదిత్య, కూతురు ఐశ్వర్య ఉన్నారు. కుమారుడు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. తండ్రి చివరి చూపు కోసం వస్తుండటంతో అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు. సర్పంచ్ అభ్యర్థి మురళి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
యథావిధిగా ఎన్నికలు
సర్పంచ్ అభ్యర్థి మృతిచెండంతో ఎన్నికలు నిర్వహిస్తారా.. లేదా.. అనే అనుమానంతో శుక్రవారం గ్రామంలో ఎవరూ ప్రచారం చేయలేదు. ఎన్నికలు యథావిధిగా నిర్వహిస్తామని ఎంపీడీవో కీర్తన ప్రకటించారు.
వలస కార్మికుల భద్రతపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి
వలస కార్మికుల భద్రతపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి


