
పోస్టల్ బీమా.. జీవితానికి ధీమా
వినియోగించుకోవాలి
బోయినపల్లి(చొప్పదండి): పోస్టల్‌శాఖలోని బీమా పథకాలు.. పేదల్లో ధీమా పెంచుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని నేటి రోజుల్లో ఓ బీమా పథకంలో చేరితే కుటుంబానికి ధీమాగా ఉంటుందని పేద, మధ్యతరగతి ప్రజలు భావిస్తున్నారు. ఈక్రమంలోనే పోస్టల్‌శాఖపై ఉన్న నమ్మకంతో ఆ శాఖ అమలు చేస్తున్న పథకాలలో చేరుతున్నారు. తక్కువ ప్రీమియంతో అధిక బీమా వర్తిస్తుండడంతో ఆసక్తి చూపుతున్నారు.
తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా
రోడ్డు ప్రమాదాలు.. విద్యుత్‌షాక్, పాముకాట్లు ఇలా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆర్థికంగా ఆసరాగా ఉంటుందని పోస్టల్ శాఖ ప్రమాద బీమాలో చేరుతున్నారు. ఆస్పత్రుల్లో పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించేందుకు పలువురు ఆస్తులు అమ్ముకోవడం చూస్తున్న ప్రజలు ప్రమాదమీమా చేయించుకుంటున్నారు.
ఐపీపీబీ పథకంలో ప్రమాద బీమా
ఐపీపీబీ(ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్) వారు ప్రమాద బీమా విషయంలో టాటా ఏఐజీ, నివాబుపా, ఆదిత్య బిర్లా క్యాపిటల్, స్టార్, బజాజ్ అలియంజ్, రాయల్ సుందరం, రిలయన్స్ తదితర సంస్థలతో కలిసి ప్రమాదబీమా ప్రవేశపెట్టినట్లు ఐపీపీబీ కరీంనగర్ మేనేజర్ మధుమోహన్ తెలిపారు. డివిజన్‌లో ఇప్పటి వరకు 34,500 వరకు ఈ పాలసీలు చేసినట్లు వివరించారు. పోస్టల్ శాఖ వారి ఐపీపీబీ ఖాతాదారునికి మాత్రమే సామూహిక ప్రమాదబీమా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో చేరాలంటే మొదట రూ.200 చెల్లించి ఐపీపీబీలో ఖాతా తీయాలి. అనంతరం సామూహిక ప్రమాదబీమాకు వార్షిక ప్రీమియం చెల్లించాలి.
కరీంనగర్ డివిజన్ పోస్టల్ సమాచారం
హెడ్ పోస్టాఫీసులు : కరీంనగర్, జగిత్యాల
సబ్ పోస్టాఫీసులు : 52
బ్రాంచ్ పోస్టాఫీసులు : 389
ఇప్పటి వరకు చేసిన బీమా పాలసీలు : 34,500
తక్కువ ప్రీమియం.. ఎక్కువ ప్రయోజనాలు
పోస్టల్ శాఖ కొత్త పథకాలతో పేదలకు లబ్ధి
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు పెద్ద మొత్తంలో ప్రీమియం వెచ్చించి ప్రమాద బీమా చేసుకుంటున్నారు. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు ఆధ్వర్యంలో టాటా ఏఐజీ, బజాజ్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, నివాబుపా, రాయల్ సుందరం తదితర సంస్థలతో కలిసి గ్రూప్ యాక్సిడెంట్ పాలసీని ప్రవేశపెట్టింది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పథకంలో చేరాలనుకునే వారు సమీప పోస్టాఫీసులో సంప్రదించాలి.
– మధుమోహన్ కంది,
ఐపీపీబీ, సీనియర్ మేనేజర్ కరీంనగర్