
ఇరాక్‌లో పెగడపల్లి వాసి మృతి
పెగడపల్లి: స్వదేశానికి వచ్చేందుకు రెండు రోజులు క్రితం విమాన టికెట్టు బుకింగ్ చేసుకున్న వలస జీవి.. అంతలోనే గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. పెగడపల్లి మండలకేంద్రానికి చెందిన లింగంపల్లి రమేశ్ (55) ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం ఇరాక్ వెళ్లాడు. స్వదేశానికి వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రమేశ్ గుండెలో నొప్పిగా ఉందంటూ చెప్పగా.. తోటిమిత్రులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారమందింది. క్షేమంగా ఇంటికొస్తాడని అనుకుంటున్న సమయంలో ఇలా గుండెపోటు రూపంలో మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రమేశ్‌కు భార్య, కుమారుడు, కూతురున్నారు.
ఇంటికొచ్చేందుకు టికెట్ బుకింగ్..
అంతలోనే గుండెపోటు