
మహిళా శక్తికి కరీంనగర్ నిదర్శనం కావాలి
కరీంనగర్ కార్పొరేషన్: మహిళా శక్తికి కరీంనగర్ జిల్లా నిదర్శనం కావాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. డీఆర్‌డీవో, మెప్మా ఆధ్వర్యంలో కరీంనగర్ నియోజకవర్గస్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాలను శనివారం కళాభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. గతంలో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో 42ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఉండగా, మొన్నటి యాసంగిలో 150 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 342 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించే పనిని గ్రూపు సభ్యులకు అప్పగించి, రూ.కోటి 50 లక్షల ఆదాయం పొందేలా చేశామని తెలిపా రు. మహిళా శక్తి క్యాంటీన్లు విజయవంతంగా నిర్వహిస్తున్నారని, త్వరలో పెట్రోల్ బంక్, సోలార్ విద్యుత్ వంటి వ్యాపారాలు మహిళలకు అప్పగిస్తామని అన్నారు. బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంలోనూ, లోన్ రికవరీ లోను జిల్లా ముందంజలో ఉందని అన్నారు. శుక్రవారం సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని, ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాల ని సూచించారు. బీపీ, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ మహిళల పాత్ర చాలా కీలకమైనదని తెలిపారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ మాట్లాడుతూ నగరంలో సుమా రు రూ.40 కోట్ల బ్యాంక్‌లింకేజీ రుణాలను మహిళలకు అందించామన్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణాలు, లోన్ బీమా, ఆర్టీసీ అద్దె బస్సుల నుండి వచ్చిన ఆదాయం, యూనిఫామ్ కుట్టు చార్జీల చెక్కులు అందజేశారు. మెప్మా పీడీ వేణుమాధవ్, డీఆర్‌డీవో శ్రీధర్ పాల్గొన్నారు.
● కలెక్టర్ పమేలా సత్పతి