
పోచమ్మ విగ్రహం ధ్వంసం
ధర్మపురి: గ్రామ దేవత పోచమ్మ తల్లి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన కోస్నూరుపల్లెలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని కోస్నూర్‌పల్లెలో ఆరేళ్ల క్రితం అమ్మవారికి గుడికట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం ఓ భక్తురాలు జున్ను పాలను అమ్మవారికి సమర్పించడానికి వెళ్లగా విగ్రహం రెండు ముక్కలుగా పడిపోయి ఉంది. ఆమె మాజీ సర్పంచ్ ఎన్నం లక్ష్మారెడ్డికి సమాచారం చేరవేసింది. ఆయన సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్‌కుమార్‌తో కలిసి ఆలయానికి చేరుకున్నారు. జగిత్యాల నుంచి డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. మాజీ సర్పంచ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఐదుగురిపై కట్నం కేసు
జమ్మికుంట(హుజూరాబాద్): అదనపు కట్నం తేవాలని వేధిస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. వివరాలు.. మండలంలోని రంగమ్మపల్లి గ్రామానికి చెందిన సుజాతకు ఇల్లందకుంట మండల కేంద్రానికి చెందిన మీసా కిరణ్‌తో 2022లో కట్న కానుకలతో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. తర్వాత అదనపు కట్నం తేవాలని బూతులు తిడుతూ, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని భర్త కిరణ్, అత్త రాజవ్వ, బావ–తోటికోడలు అశోక్, మమత, ఆడపడుచు భర్త సదానందంపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.