
‘విపంచి’ పుస్తకావిష్కరణ
కరీంనగర్‌కల్చరల్: ఆరోగ్యకర, ఉత్తమ సమాజ నిర్మాణానికి విపంచి గేయ సంపుటిలోని పాటలు దోహదపడతాయని ప్రముఖ రచయిత కస్తూరి మురళీకృష్ణ అన్నారు. కవి నగునూరి రాజన్న వెలువరించిన ‘విపంచి’ గేయ సంపుటిని ఆదివారం భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించి మాట్లాడారు. పాటల రచనకు వయసుతో సంబంధం లేదని, కవి భావాల ప్రతిస్పందనలే కవితలు, పాటలుగా రూపొందుతాయన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న కవి, రచయిత, విమర్శకులు దాస్యం సేనాధిపతి మాట్లాడుతూ, విపంచి గేయ సంపుటిలో బాలగేయాలు, భక్తి గేయాలు, పర్యావరణ, చైతన్య, అభ్యుదయ, జానపద, లలిత గేయాలతోపాటు కార్మిక గేయాలు కూడా ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో కవులు వేములవాడ ద్రోణాచారి, బొమ్మకంటి కిషన్, అన్నాడి గజేందర్‌రెడ్డి, దామరకుంట శంకరయ్య, ఎలగొండ రవి, గూడెపు కుమార్, ఏడెల్లి రాములు, మేడి చంద్రయ్య, వెల్ముల జయపాల్‌రెడ్డి, మానుపాటి రాజన్న, గుండు రమణయ్య, ఎన్.రాజయ్య తదితరులున్నారు.