
ఓ వైపు భయం.. మరో వైపు దావత్‌లు
● స్కైలాబ్ ఉపగ్రహం
నేలకూలి 46 ఏళ్లు
● జ్ఞాపకాల యాదిలో అప్పటి తరం
చొప్పదండి: ఉపద్రవం ముంచుకొస్తోందని ఒకవైపు ఆందోళన, ఎలాగూ మరణిస్తున్నామనే భావనలో జల్సాలు చేసుకోవడం మరోవైపు వెరసి, జన జీవనాన్ని అతలాకుతలం చేసిన శ్రీస్కైలాబ్‌శ్రీ ఘటనకు 46 ఏళ్లు నిండాయి. స్కైలాబ్ అనే ఉపగ్రహం దారితప్పి భూమండలంపై కూలిపోతోందని, అది దేశంలో పడితే మరణాలు తప్పవనే ప్రచారంతో 1979 జూలైలో అప్పటి జన జీవనమే అదుపుతప్పింది. శాస్త్రవేత్తలు ప్రయోగించిన ఉప గ్రహమైన స్కైలాబ్ కూలిపోతుందని అప్పట్లో రేడియోలలో ప్రచారం జరిగింది. దీంతో ధనిక, పేద లేకుండా గ్రామాల్లో భయాందోళనలతో గడిపారు. మేకలు, కోళ్లు, గొర్రెలను కోసుకొని తిని ఎలాగు చనిపోతున్నామని పండుగ చేసుకున్నారు. తమకున్న వస్తువులను తక్కువ ధరలకే అమ్ముకుని మరీ జల్సాలు చేశారు. శాస్త్రవేత్తలు ఎట్టకేలకు స్కైలాబ్‌ను సముద్రంలో కుప్పకూల్చేలా విజయం సాధించారు. ఉపగ్రహంతో ఉపద్రవం లేదనే రేడియో వార్తలు రావడంతో మళ్లీ కొద్ది రోజుల పాటు ప్రజలు ఉత్సవాలు జరుపుకున్నారు. స్కైలాబ్ సముద్ర మట్టమైన రోజు పుట్టిన పిల్లలకు గుర్తుగా అదేపేరు పెట్టడం గమనార్హం. జూలై 11కు స్కైలాబ్ పడి 46 ఏళ్లు గడిచినా అప్పటి జ్ఞాపకాలు మాత్రం పలువురి మదిలో ఇంకా పదిలంగానే ఉన్నాయి.