
కూలీల ఆటోను ఢీకొట్టిన స్కూల్ బస్సు
● ముగ్గురికి తీవ్ర, ఆరుగురికి స్వల్పగాయాలు
ముత్తారం(మంథని): మండలంలోని మైదంబండ ప్రధాన రోడ్డుపై శుక్రవారం ప్రైవేట్ స్కూల్‌బస్సు కూలీల ఆటోను ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర, ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మండలంలోని కేసనపల్లికి చెందిన సిద్ధి ఉమా, సాగర్ల కీర్తన, కందుల అఖిల, కలవేన కోమల, కొండవేన ఉమ, మానస, మల్లేశ్వరి, చొప్పరి రాధ పోతారానికి చెందిన గాడిచర్ల శంకర్ ఆటోలో రామగిరి మండలం సెవెన్ ఎల్‌బీ గనిలో మొక్కలు నాటడానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో మైదంబండ వద్ద కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను రామగిరి మండలం సెంటనరీకాలనీలోని ప్రగతి హైస్కూల్‌కు చెందిన బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. బస్ డ్రైవర్ పరార్ అయ్యాడు. కూలీలు గాయలు కావడంతో స్థానికులు ప్రైవేటు వాహనాల్లో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ శంకర్, కూలీలు ఉమా, కీర్తనకు తీవ్రగాయాలు కాగా, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని ఎస్సై నరేశ్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.