సీసీలపై చర్యలేవి?
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
కరీంనగర్ కలెక్టరేట్‌లో సంచలనం రేపుతోన్న సీసీల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వీరిపై ఎన్ని కథనాలు.. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా.. కలెక్టరేట్ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై నగరవాసులు మండిపడుతున్నారు. దీంతో నగరానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)కు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌లో సీసీల కారణంగా పరిపాలన పక్కదారి పడుతున్న విషయాన్ని కలెక్టర్ కార్యాలయం గుర్తించని వైనంపై ఆవేదన వ్యక్తంచేస్తూ డీవోపీటీని సంప్రదించారు. కలెక్టర్ కార్యాలయం స్పందించకుంటే.. తాను లోకాయుక్తను సైతం ఆశ్రయించేందుకు సిద్ధమేనని ‘సాక్షి’కి స్పష్టంచేశారు. ఇదే సమయంలో కలెక్టరేట్‌లో సీసీల వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు ‘ఎక్స్’ వేదికగా ఇది వరకే ఫిర్యాదు వెళ్లింది. మరోవై పు సీసీలు లోలోన హైరానా పడుతున్నా.. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.
మొద్దునిద్రలో కలెక్టరేట్..
సీసీల వ్యవహారంపై ఇంత చర్చ నడుస్తున్నా.. దశాబ్దాలుగా పాతుకుపోయిన సీసీలను తప్పించేందుకు కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అన్నది అంతుచిక్కడం లేదు. ఇదే విషయమై వివరణ కోరేందుకు కలెక్టర్ పమేలా సత్పతిని ఫోన్‌లో సంప్రదించగా.. ఆమె అందుబాటులోకి రాలేదు. మీడియా కథనాలపై సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి కలెక్టరేట్లు వెంటనే స్పందిస్తాయి. సంబంధిత అధి కారులు, విభాగాలపై కొరడా ఝుళిపిస్తాయి. కానీ.. కరీంనగర్‌లో ఇవేమీ ఉండవంటే అతిశయోక్తి కాదు. పలు విభాగాల్లో అవినీతి అంటూ వార్తలు వచ్చినా.. క్రమశిక్షణ చర్యల కింద కనీసం ఇంతవరకూ ఎవరినీ సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు. ఇటీవల మయన్మార్‌లో సైబర్ ముఠా చేతిలో చిక్కుకు న్న భారతీయుల స్థితిగతులపై ‘సాక్షి’లో వార్తలు రాగానే.. కేంద్రం స్పందించింది. మిలటరీ ఆపరేష న్ నిర్వహించి మరీ భారతీయులను కాపాడింది. ప్రత్యేకంగా రెండు విమానాలు పంపి వారిని స్వదేశానికి తీసుకువచ్చింది. గతంలోనూ కంబోడియాలో చిక్కుకున్న వారిని ఇలాగే మీడియా కథనాల ద్వారా తెలుసుకుని కేంద్రమే కాపాడింది. ఉమ్మడి జిల్లాలో కలెక్టరేట్‌లు, హైదరాబాద్‌లోని సచివాల యం, సీఎం కార్యాలయం, ఆఖరికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలు, అవినీతి వ్యవహా రాలపై వెంటనే స్పందిస్తున్నాయి. కానీ..కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ఇందుకు మినహాయింపు అన్న విమర్శలను మూటగట్టుకుంటుంది.
కదలరు.. వదలరు
వారి అక్రమాలపై డీవోపీటీ, బండి సంజయ్‌కు ఫిర్యాదుల వెల్లువ
ప్రజావాణిలో తమపై ఫిర్యాదుతో మల్లగుల్లాలు
ఏసీబీ, ఇంటెలిజెన్స్‌లోనూ సీసీల మనుషులు
సమస్యలపై వెంటనే స్పందిస్తున్న సచివాలయం, ఇతర జిల్లాలు, కేంద్రం
కానీ.. మొద్దునిద్రలో కరీంనగర్ కలెక్టరేట్
ఏసీబీ, ఇంటెలిజెన్స్‌లోనూ సీసీల మనుషులే..
కారుణ్య నియామకం ద్వారా సీసీలుగా చేరిన వీరంతా ముఠాగా ఏర్పడ్డారు. దశాబ్దాలుగా అక్కడే పాతుకపోయి.. బదిలీ అంటే కరీంనగర్ కలెక్టరేట్‌లో సెక్షన్ మారడమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఐఏఎస్ అధికారులు కూడా వీరికి అనుకూలంగా వ్యహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నా.. ఇప్పటివరకూ వీరిపై ఏ చర్యలు తీసుకోకపోవడంపై జిల్లాపౌరులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. ఈ సీసీలు కేవలం కలెక్టరేట్ వ్యవహారాలకే పరిమితం కాలేదు. తమపై ప్రభుత్వానికి ఏ నివేదిక వెళ్తుందో తెలుసుకునేందుకు ఏసీబీ, ఇంటెలిజెన్స్‌లోనూ కొందరిని తమకు అనుకూలంగా మార్చుకున్నారంటే వీరి తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలా ఏ విభాగం నుంచి వీరికి, వీరి అనుచరులకు ప్రతికూల నివేదికలు, ఫిర్యాదులు వచ్చినా..వాటిని కలెక్టర్ల కంట పడకుండా బుట్టదాఖలు చేస్తున్నారు. జిల్లాలో ఎలాంటి అక్రమ వ్యాపారమైనా... విద్య, వైద్యం, వాణిజ్యం, టెండర్లు ఇలా విషయం ఏదైనా ‘సీసీ ఆశీస్సులు ఉంటే చాలు పనవుద్ది’ అన్న ధీమా అక్రమార్కుల్లో పెరిగిపోవడానికి కారణం వీరి అండదండలే.
సీసీలపై చర్యలేవి?
సీసీలపై చర్యలేవి?


