కరీంనగర్‌క్రైం: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్ మంగళవారం నగరంలోని స్వధార్ హోమ్, శిశుగృహ, బాలసదన్‌ను సందర్శించారు. విద్యార్థి దశలో చెడు అలవాట్లకు లోను కావద్దన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దన్నారు. కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాక్షించారు. ఎలాంటి న్యాయపరమైన సేవలు అవసరమైనా సంప్రదించాలని నిర్వాహకులను ఆదేశించారు. స్వధార్‌హోమ్‌లో పండ్లు పంపిణీ చేశారు. లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్ పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికుల తొలగింపు
ఇల్లందకుంట: ఇల్లందకుంట జెడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించారు. ఈ నెల 24న ‘మధ్యాహ్న భోజనం నాసిరకం’ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనానికి తహసీల్దార్ రాణి స్పందించారు. మంగళవారం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. గతంలోనూ ఇలాంటి ఘటనపై మధ్యాహ్న భోజన కార్మికులను హెచ్చరించినా.. తీరు మార్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించి, కొత్తవారిని నియమించాలని ఎంఈవో రాములునాయక్‌కు సూచించారు. అంతకుముందు సీపీఎం, సీపీఐ మండల కార్యదర్శులు రాము, రత్నాకర్, విద్యార్థి సంఘం నాయకులు అనిల్, కౌశిక్ పాఠశాలను సందర్శించారు. బాధ్యులైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాధ్యతగా విధులు నిర్వహించాలి
జమ్మికుంట: పోలీసులు బాధ్యతగా విధులు నిర్వహించాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. పట్టణంలోని టౌన్ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. ఏసీపీ మాధవి, టౌన్ సీఐ ఎస్.రామకృష్ణ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. సోలార్ సిస్టంతో ఏర్పాటు చేసిన 14సీసీ కెమెరాలు ప్రారంభించారు. రికార్డులు, సీసీటీఎన్‌ఎస్, కేసుల వివరాలను పరిశీలించారు. రౌడీ, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
రికార్డుల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి
హుజూరాబాద్: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా పెట్టాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్లను సందర్శించారు. పెండింగ్ కేసుల విచారణ వేగవంతం చేయాలన్నారు. ఏసీపీ మాధవి, సీఐలు కరుణాకర్, పి.వెంకట్ ఉన్నారు.
పునర్విభజన జీవో జారీ
● సోషల్ మీడియాలో చక్కర్లు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని 66 డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన తుది ఉత్తర్వును రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. నగరంలోని 60 డివిజన్లను 66కు పెంచడంతో చేపట్టిన పునర్విభజన ప్రక్రియ ఈ నెల 21వ తేదీతో ముగియడం తెలిసిందే. అదేరోజు ఫైనల్ నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉండగా జాప్యం చోటుచేసుకుంది. నోటిఫికేషన్‌పై మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా ఈ నెల 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 144, తేదీ 21, 06, 2025 ఉత్తర్వు ప్రతి మంగళవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. కాని జీవో ప్రతితో పాటు రావాల్సిన 66 డివిజన్ల వివరాలు లేకపోవడం అయోమయానికి దారితీసింది. అధికారులు సైతం తమకు 66 డివిజన్ల జాబితా అందుబాటులో లేదని చెప్పడం గమనార్హం.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
బాధ్యతగా విధులు నిర్వహించాలి


