
ఆహ్లాదం.. ఆరోగ్యం
● కనువిందు చేస్తున్న అటవీ ప్రాంతం
● అడవుల రక్షణకు అధికారుల చర్యలు
● సేదతీరుతున్న పర్యావరణ ప్రియులు
మంథని: వేసవి ముగిసింది. తొలకరి పలకరించింది. అడవులు ఆకుపచ్చదనం సంతరించుకున్నాయి. నిన్నామొన్నటి వరకు మోడువారిన చెట్లు చిగురిస్తున్నాయి. చిగురించిన ఆకులతో పచ్చదనం కనువిందు చేస్తోంది. తూర్పు అటవీ ప్రాంతమైన మంథని నియోజవకర్గంలోని అడవులు ఆహ్లాదం పంచుతున్నాయి. పర్యావరణ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మంథని నుంచి మహదేవపూర్ వరకు..
మంథని మండలం ఎక్లాస్‌పూర్ శివారు మొదలు అటవీ ప్రాంతంలో మహదేవ్‌పూర్ మండలం బూర్గుగూడెం వరకు సుమారు 120 కి.మీ. మేర అడవి విస్తరించి ఉంది. రామగిరి, కమాన్‌పూర్ మండలాలు మినహా నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు, పెద్దపల్లి, రామగిరి మండలాల్లో సైతం అడవులు విస్తరించి ఉన్నాయి. ఒకప్పుడు అంతరించిపోయిన అడవులకు హరితహరం పేరిట ప్రభుత్వాలు మొక్కలు నాటుతూ జీవం పోశాయి. ప్రస్తుతం పచ్చదనం ఉట్టిపడుతుండగా అటువైపు వెళ్లే వాహనదారులు పచ్చని చెట్లఒడిలో సేద తీరుతున్నారు.
స్మగ్లర్ల గొడ్డలి వేటుకు దూరంగా..
ఒకప్పుడు దట్టమైన అడవులపై స్మగ్లర్ల గొడ్డలి వేటు పడటంతో పెద్దచెట్లు అంతరించిపోయాయి. కలప అక్రమ రవాణా చేస్తూ అడవులను నాశనం చేశారు. దీంతో ఎటుచూసినా పచ్చదనం ఉట్టిపడే అడవులు కానరాకుండా పోయాయి. కానీ ప్రస్తుతం అడవులు మళ్లీ పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి.
అడవుల రక్షణకు పటిష్ట చర్యలు..
గత ప్రభుత్వాలు అడవుల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాయి. ఇటు ఫారెస్ట్, అటు పోలీసులు సంయుక్తంగా అడవుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. కలప స్మగ్లర్ల అక్రమ రవాణాను అడ్డుకోవడంతోపాటు వంటచెరుకును కూడా తీసుకుపోకుండా కందకాలు తవ్వారు. అడవిలో అడుగుపెట్టకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో అడవులు మళ్లీ చిగురించాయి. హరితహారం పేరుతో అడవుల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతో అడవులకు పూర్వవైభవం వచ్చినట్లయ్యింది.
కనువిందు చేస్తున్న పచ్చదనం..
తూర్పు అడవుల్లో చిగురించిన పచ్చని ఆకులు, చెట్లు కనువిందు చేస్తున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులు కాళేశ్వరం, మేడారం, నాగులమ్మలాంటి ఆలయాలను దర్శించుకునేందుకు వెళ్తూ అటవీ ప్రాంతాల్లోని పచ్చని చెట్లకింద సేద తీరుతున్నారు. కాసేపు ఆహ్లాదకరమైన వాతావరణ అనుభూతిని పొందుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. చెట్ల నీడన సేదదీరుతూ ఆటాపాటనతో ఎంజాయ్ చేస్తున్నారు.

ఆహ్లాదం.. ఆరోగ్యం

ఆహ్లాదం.. ఆరోగ్యం