
కరీంనగర్ రైల్వేస్టేషన్
అభివృద్ధికి నిదర్శనం
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్‌రూరల్: ఎన్‌డీఏ ప్రభుత్వ హయంలో రైల్వేస్టేషన్లు అభివృద్ధి చెందాయనడానికి కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణే నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని బికనూర్ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కరీంనగర్ రైల్వేస్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యక్షంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ జమ్మికుంట రైల్వేస్టేషన్‌ను సైతం అమృత్ భారత్ పథకంలో ఆధునీకరిస్తామని తెలిపారు. జూన్ నెలాఖరులోగా ఉప్పల్ ఆర్వోబీ పూర్తి చేస్తామని, కరీంనగర్– హసన్‌పర్తి రైల్వేలైన్ నిర్మాణానికి రూ.1480 కోట్లు అవసరమని డీపీఆర్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. తిరుపతి రైలును వారంలో నాలుగుసార్లు నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ రైల్వేస్టేషన్‌కు కృషి చేశానని, ప్రస్తుతం తిరుపతికి వారంలో రెండు పర్యాయాలు నడుస్తున్న రైలును ప్రతిరోజూ నడిపించేలా చూడాలన్నారు. కరీంనగర్– ముంబయి, షిర్డీకి రైలు నడిపించాలన్నారు. అనంతరం రైల్వేస్టేషన్‌లో పర్యటించి లిఫ్టులు, ఎస్కలేటర్లు, బుకింగ్‌కౌంటర్లను మంత్రులు పరిశీలించారు. ఎమ్మెల్సీలు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య, సీపీ గౌస్ ఆలం, రైల్వే రీజినల్ మేనేజర్ గోపాలకృష్ణన్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ మేయర్ వై.సునీల్‌రావు పాల్గొన్నారు.
సభ ఏర్పాట్లలో విఫలం
కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభోత్సవ సభ నిర్వహణలో రైల్వేఅధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రెస్ గ్యాలరీ కుర్చీల్లో రాజకీయ నాయకులతో పాటు ఇతరులు కూర్చోవడంతో మీడియా ప్రతినిధులు నిలుచునే పరిస్థితి ఏర్పడింది. స్నాక్స్, తాగేందుకు మంచినీళ్లు ఇవ్వకపోవడంతో పలువురు ఇబ్బందులకు గురయ్యారు. సభకు తీగలగుట్టపల్లి నుంచి పెద్దసంఖ్యలో మహిళలను స్థానిక బీజేపీ నాయకులు తీసుకురాగా.. రైల్వేస్టేషన్‌లోకి పోలీసులు, రైల్వే సిబ్బంది అనుమతించకపోవడం వివాదాస్పదంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులే సభ బాధ్యతలు చూసుకున్నారని, తమకు సంబంధం లేదని స్థానిక రైల్వే అధికారులు పేర్కొన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ
బీఆర్‌ఎస్ లేఖలకే పరిమితం
బీఆర్‌ఎస్ నాయకులు గతంలో ప్రతీ విషయానికి లేఖలు రాసి చేతులు దులుపుకున్నారే తప్పా ఎలాంటి అభివృద్ధి చేయలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ప్రస్తుతం రైల్వేస్టేషన్ల అభివృద్ధి తమవల్లే జరుగుతోందని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. మాటలు కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అనేది చూడాలని కోరారు. ఎన్‌డీఏ ప్రభుత్వ హయంలో రైల్వేస్టేషన్లు అభివృద్ధి చెందాయని చెప్పడానికి కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణే నిదర్శనమన్నారు.