
విద్యార్థులకు ప్రాథమిక విద్యే పునాది
● ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి ● ఉపాధ్యాయులకు కలెక్టర్ పమేలా సత్పతి సూచన
కొత్తపల్లి(కరీంనగర్): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుశాతాన్ని పెంచి, నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. విద్యార్థుల భవిష్యత్‌కు ప్రాథమిక విద్య పునాదిలాంటిదని, ఉపాధ్యాయులు సేవా దృక్పథంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్ పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి బుధవారం హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలకు విద్య నేర్పడంతో పాటు ఉపాధ్యాయులు సైతం విభిన్నమైన కొత్త అంశాలను నేర్చుకోవాలన్నారు. జిల్లా యంత్రాంగం తరఫున ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ట్రైనింగ్ మెటీరియల్ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సెయింట్ జార్జ్ పాఠశాలలో సుమారు 60మంది ప్రభుత్వ విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు. ఆ విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. వారి శిక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, సెయింట్ జార్జ్ పాఠశాల చైర్మన్ ఫాతిమారెడ్డి, ఎంఈవోలు పాల్గొన్నారు.