
ఏడేళ్లుగా రోడ్డు కష్టాలు
వీణవంక: జమ్మికుంట– మానకొండూర్ నాలుగు వరుసల రహదారి పనులు ఏడేళ్లుగా కొనసాగుతూ... ఉన్నాయి. పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నా రోడ్డు పూర్తికావడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వంతో వాహనదారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆబాది జమ్మికుంట నుంచి నర్సింగాపూర్ వరకు, వీణవంక నుంచి మానకొండూరు వరకు 66ఫీట్ల వెడల్పుతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ఏడేళ్లు పూర్తవగా అక్కడక్కడ అసంపూర్తి రోడ్డుతో వెలువడుతున్న దుమ్ము కారణంగా వాహనదారులు యాతన పడుతున్నారు. కరీంనగర్– జమ్మికుంట మధ్య మానకొండూర్ మీదుగా నిత్యం వందలాది వాహనాలు నడుస్తుంటాయి. ఆర్టీసీ బస్సులు 16 ట్రిప్పులకు పైగా తిరుగుతాయి. నాలుగు మండలాల పరిధిలోని 100కు గ్రామాలకు ఈ దారి ప్రధానమైంది. జమ్మికుంట– నర్సింగాపూర్ మధ్య ఫోర్‌లైన్ కోసం 2018లో రూ.33 కోట్లు కేటాయించారు. వీణవంక నుంచి మానకొండూరు వరకు 66ఫీట్ల రోడ్డుకు రూ.30కోట్లు మంజూరు చేశారు. కోర్కల్– శ్రీరాములపేట గ్రామాల మధ్య కంకర పోసి వదిలేశారు. మామిడాలపల్లి అనుబంధ గ్రామమైన గొల్లపల్లి వద్ద కల్వర్టు, పచ్చునూరులో రెండు, లలితాపూర్, అన్నారం గ్రామాల మధ్య కల్వర్టుల పనులు మధ్యలో నిలిచిపోయాయి. రెడ్డిపల్లి బస్డాండ్ వద్ద గుంత ఏర్పడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీణవంక బ్రిడ్జి సమీపంలోని బ్రహ్మణపల్లి క్రాస్‌వద్ద రోడ్డు అస్తవ్యస్థంగా ఉంది. నర్సింగాపూర్ నుంచి వీణవంక వరకు మూడేళ్ల క్రితం ఫోర్‌లైన్ మంజూరు కాగా కంకర పోసి వదిలేశారు. మామి డాలపల్లి శివారు గొల్లపల్లి వద్ద కల్వర్టు తెగిపోయింది. అధికారులు, పాలకులు స్పందించి రోడ్డు త్వరగా పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.
అసంపూర్తిగా జమ్మికుంట– కరీంనగర్ ప్రధాన రహదారి
ఐదుచోట్ల పూర్తికాని కల్వర్టులు
కోర్కల్– శ్రీరాములపేట మధ్య కంకర పోసి వదిలేసిన వైనం
దుమ్ముతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు