
పుస్తకాలొచ్చేశాయ్
కరీంనగర్: పాఠశాలలు పునఃప్రారంభంనాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠ్యపుస్తకాల సరఫరాకు చర్యలు ప్రారంభించింది. విద్యా సంవత్సరం ప్రారంభంలో పార్ట్–1 పుస్తకాలు అందించనున్నారు. ఎస్‌ఏ–1 పరీక్షలు పూర్తయ్యాక సెప్టెంబర్, అక్టోబర్‌లో పార్ట్–2 పుస్తకాలు అందజేయనున్నారు. ఈ ఏడాది కొత్తగా పాఠ్యపుస్తకాలపై ఎలాంటి సమస్య ఉన్నా... డయల్ 100కు ఫోన్ చేయాలని, బాలికలను వేధించినా... బాల్యవివాహాలు చేసినా.. బాలలను పనిలో పెట్టుకున్నా చైల్డ్‌లైన్ నంబర్ 1098 కు ఫోన్ చేయాలని ముద్రించారు. జిల్లాలో వివిధ యాజమాన్యాల ఆధ్వర్యంలో 676 పాఠశాలల్లో 82 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి 3,20,430 పుస్తకాలు అవసరం కాగా.. ఇప్పటి వరకు 2,74,980 పుస్తకాలు వచ్చాయి. ఇంకా 45,450 పుస్తకాలు రావాల్సి ఉంది. గోడౌన్ల నుంచి పుస్తకాలను ఆయా పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. ఇది ఇలాఉంటే ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకూ నోట్‌బుక్స్ ఇవ్వనున్నారు. కాగా, ఇప్పటికే జిల్లాకు 86 శాతం పుస్తకాలు చేరుకున్నట్లు డీఈవో జనార్దన్‌రావు తెలిపారు. పాఠశాలల పునః ప్రారంభం నాటికి పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ అందజేస్తామని పేర్కొన్నారు.
ఎయిర్‌పోర్టు తరహాలో రైల్వేస్టేషన్ నిర్మాణం
● దక్షిణమధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ శివప్రసాద్
కరీంనగర్‌రూరల్: అమృత్ భారత్ పథకంలో భాగంగా తెలంగాణలో రూ.2వేల కోట్లతో 37 రైల్వేస్టేషన్లను ఎయిర్‌పోర్టు తరహాలో అభివృద్ధి చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆధునీకరణ పనులను సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ.30 కోట్లతో కరీంనగర్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేశామని, ఆరు బుకింగ్ కౌంటర్లు, రెండు ఎక్స్‌కావేటర్లు, లిఫ్ట్‌లు, వెయిటింగ్‌హాల్ నిర్మించినట్లు వివరించారు. స్టేషన్ ఆవరణలో కాక్‌టెల్ పార్క్‌తోపాటు అప్రోచ్‌రోడ్డు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 22న తెలంగాణలోని కరీంనగర్, బేగంపేట, వరంగల్ రైల్వేస్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్‌లో కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డివిజనల్ ఇంజినీర్ భిక్షపతి, స్టేషన్ మేనేజర్ ఎం.రవీందర్, కమర్షియల్ మేనేజర్ భానుచందర్, జానకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున మంగళవారం పలు ప్రాంతాల్లో సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్– 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు 11 కేవీ గోదాంగడ్డ ఫీడర్ పరిధిలోని శ్రీనగర్‌కాలనీ, భవానీకాలనీ, సప్తగిరికాలనీ, దోబీఘాట్, ఏఓస్ పార్కు కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. అలాగే విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున ఉదయం 8 నుంచి 11 గంటల వరకు 11 కేవీ రేకుర్తి ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు కరీంనగర్‌రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. మరమ్మత్తు పనుల నిమిత్తం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 33/11 కేవీ చెర్లభూత్కూర్, మొగ్ధుంపూర్ సబ్‌స్టేషన్‌ల పరిధిలోని మొగ్ధుంపూర్, ఇరుకుల్ల, నల్లగుంటపల్లి, చెర్లభూత్కూర్, చామన్‌పల్లి, దుబ్బపల్లి, ఫకీర్‌పేట, జూబ్లీనగర్, బహద్దూర్‌ఖాన్‌పేట, తాహెర్‌కొండాపూర్, ఎలబోతారం గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.
పుష్కరాల ప్రత్యేకాధికారిగా ప్రఫుల్ దేశాయ్
కరీంనగర్ అర్బన్: సరస్వతి పుష్కరాల పర్యవేక్షణకు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌ను ని యమించారు. పుష్కరాలు ముగిసే వరకు ఆయన ప్రత్యేక అధికారిగా వ్యవహరించనున్నారు.