
‘ఇందిరమ్మ’ను వేగవంతం చేయండి
● భూభారతి సమస్యలు పరిష్కరించండి ● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ అర్బన్/కరీంనగర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, భూభారతి పోర్టల్ లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. పైలెట్ గ్రామాల్లో 2027 ఇండ్లు మంజూరు అయ్యాయని, వెంటనే మార్కింగ్ చేసి నిర్మించేలా చూడాలన్నారు. అనర్హులు ఎవరైనా ఉంటే వారిని తొలగించి అర్హులకు స్థానం కల్పించాలన్నారు. ఇండ్లు మంజూరైనా.. వద్దనుకునే వారి స్థానంలో పేదలకు అవకాశం ఇవ్వాలన్నారు. తహసీల్దార్ల లాగిన్‌లలో 329 భూభారతి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటన్నింటినీ తక్షణమే విచారించి పైఅధికారుల లాగిన్ కి పంపించాలని ఆదేశించారు. అంగన్వాడీలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, వెటర్నటీ దవాఖానాలు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీ సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వ స్థలం చూపాలని తహసీల్దార్లను ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం బ్యాంక్ లింకేజీ ప్రక్రియను రెండు రోజుల్లోగా పూర్తిచేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్ తదితరులు ఉన్నారు.
భవిత కేంద్రంలో సౌకర్యాలు కల్పించాలి
దివ్యాంగ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన భవిత సెంటర్లలో సౌకర్యాలు, వసతులు కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ముకరంపురలోని భవిత సెంటర్ ను సోమవారం సందర్శించారు. పెయింటింగ్ పనులను పరిశీలించారు. పిల్లలను ఆకట్టుకునేలా పెయింటింగ్ పనులు చేపట్టాలన్నారు. సెంటర్ చుట్టూ పచ్చదనం ఉండేలా మొక్కలు నాటాలని, పిల్లలు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల బోధన కోసం అవసరమైన అన్ని పరికరాలు, స్టడీ మెటీరియల్ తెప్పించాలని ఆదేశించారు. రెయిలింగ్, ర్యాంపు రాంప్ వంటివి పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. ఫిజియోథెరపిస్టు కచ్చితంగా కేంద్రానికి వచ్చేలా చూడాలని అన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, జీసీడీవో కృపారాణి, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఆంజనేయులు పాల్గొన్నారు.