
కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ కళా విహీనమైంది
కరీంనగర్: బీఆర్‌ఎస్ హయాంలో కళకళలాడిన కరీంనగర్ కాంగ్రెస్ పాలనలో కళావిహీనమైందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. జిల్లాలో నిలిచిపోయిన పనులు ప్రారంభించాలని కోరుతూ ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులతో కలిసి శనివారం కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. కరీంనగర్ సమస్యలపై ఇప్పటికే ఎన్నోసార్లు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చామన్నారు. అయినా స్పందించే నాథుడే కరువయ్యారన్నారు. జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి ఎవరో ప్రజలకు తెలియడం లేదన్నారు. ఇప్పటివరకు అభివృద్ధిపై అధికారులతో ఒక్క రివ్యూ సమావేశం నిర్వహించిన దాఖలు లేవన్నారు. ఆరు రోజులుగా నగరరంలోని రాంనగర్ ప్రాంతంలో మంచినీరు రావడం లేదన్నారు. అధికారులను ప్రశ్నిస్తే మోటార్లు కాలిపోయాయని సమాధానం ఇస్తున్నారని, వేసవిలో ప్రజలకు తాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాల న్నారు. రేషన్‌కార్డుల మంజూరుపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కరీంనగర్ డంపింగ్ యార్డు తొలగింపు ఏమైందని కేంద్రమంత్రి సంజయ్‌ని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో 5వేల కుటుంబాలు దళితబంధు కోసం ఎదురుచూస్తున్నాయని అన్నారు. ప్రభుత్వంపై నిరసన తెలిపిన దళితులపై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకు లబ్ధిదారుల నుంచి రూ.50వేలు వసూలు చేస్తున్నారని, ఈ విషయమై విచారణ జరిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, శ్రీనివాస్, చల్లా హరిశంకర్, పెండ్యా ల శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నగర సమస్యలపై ఎన్నోసార్లు కలెక్టర్‌కు విన్నవించాం
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్