
అప్పుల ఊబికి నేతన్నలు బలి
● రెండు రోజుల్లో ఇద్దరు కార్మికుల బలవన్మరణం
● ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణం
● సిరిసిల్లలో పనుల్లేవని మనస్తాపం
● సొంతిళ్లు లేక దైన్యం
● ఆస్పత్రి నుంచి నేరుగా శ్మశానానికి తరలింపు
సిరిసిల్లటౌన్: కార్మికక్షేత్రంలో సిరిసిల్లలో పనులు లేక.. అప్పుల పాలై నేతకార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉపాఽధి కరువై..కుటుంబ పోషణ భారమై..అప్పులు తీర్చే మార్గం కనిపించక ఇద్దరు కార్మికులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా విషాదం నింపింది. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రం బీవైనగర్‌కు చెందిన కొండ రాకేశ్(44) ఆరేళ్ల క్రితం ముంబయి నుంచి సిరిసిల్లకు వచ్చి నేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. భార్య ఉజ్వల, కొడుకులు ఆదిత్య(14), నిహార్(12)లతో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. వస్త్రపరిశ్రమలో సంక్షోభంతో చాలా రోజులుగా పనులు సరిగ్గా లేవు. కుటుంబ అవసరాల కోసం గతంలోనే రూ.6లక్షల వరకు అప్పులు చేశాడు. ఏడాదిగా పనులు సరిగ్గా లేక అప్పులు చెల్లించలేకపోయాడు. తీవ్ర మసస్థాపానికి గురై గురువారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకున్నాడు. శనివారం ఉదయం వరకు పోస్టుమార్టం గది వద్దే బంధువులు, కుటుంబీకులు పడిగాపులుగాచి అక్కడి నుంచే నేరుగా శ్మశానవాటికకు తీసుకెళ్లారు.
ఇద్దరు కార్మికుల ఆత్మహత్య విషాదాంతం
ఇద్దరు నిరుపేద కార్మికులు కొండ రాకేశ్, మేర్గు సాగర్ కష్టపడి భార్య, పిల్లలకు మంచి భవిష్యత్‌ను ఇద్దామనుకున్నారు. కానీ విధి వేరేలా తలంచింది. అప్పులు తీర్చలేని స్థితిలో కనీసం సొంతింటి కల తీరకుండానే ఇద్దరు బతుకులు విషాదాంతమయ్యాయి. ఇరువురికి సొంతిల్లు లేదు. డబుల్‌బెడ్‌రూమ్ కోసం అప్లయ్ చేయగా జాబితాలో పేర్లు రాలేదు. కుటుంబ అవసరాల కోసం విధి లేని పరిస్థితిలో శక్తికి మించిన అప్పులు చేశారు. అప్పులు తీర్చే మార్గం కనిపించక ఉరేసుకుని మృతిచెందారు. సొంతిల్లు లేకపోవడంతో శనివారం ఉదయం వరకు భార్య, పిల్లలు, బంధువులు పోస్టుమార్టం గది పడిగాపులు కాచి అక్కడి నుంచి నేరుగా మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. సొంతిల్లు లేకపోవడంతో శనివారం ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం కాగానే జిల్లా ఆస్పత్రి నుంచి నేరుగా అంత్యక్రియలకు తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు జిల్లా ఆస్పత్రి మార్చురీ వద్ద బాధిత కుటుంబీకులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరి దయనీయ పరిస్థితులను చూసిన స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
భోజనం చేసిన
గంటలోపే..
పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన మేర్గు సాగర్(38) పన్నెండేళ్ల్ల క్రితమే అల్లీపూర్ నుంచి సిరిసిల్లకు వచ్చాడు. భార్య అస్మిత బీడీలు చేస్తుండగా, సాగర్ నేతకార్మికుడిగా పనిచేస్తున్నాడు. గతంలో సాగర్ భార్య, కూతురుకు అనారోగ్యం, ఇంటి అవసరాల కోసం దాదాపు రూ.5లక్షల వరకు అప్పు చేశాడు. పనులు సరిగ్గా లేక వాటిని తీర్చలేక మనోవేదనకు గురయ్యేవాడు. శుక్రవారం రాత్రి 9 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి 10 గంటలకు పడుకున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో పక్క గదిలో సాగర్ ఉరివేసుకుని చనిపోయాడు.

అప్పుల ఊబికి నేతన్నలు బలి