మరో 32 జీవాలకు అస్వస్థత
ధర్మారం(ధర్మపురి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి గ్రామంలో విషాహారం తిని 48 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరో 32 జీవాలు తీవ్రఅస్వస్థతకు గురయ్యాయి. బాధితుల కథనం ప్రకారం.. రేషవేని మల్లేశం, సమ్మెట కొమురయ్య, కొమ్ము రాజేశం, కనుకయ్య, దాడి నాగయ్య అనే గొర్రెల పెంపకందారులకు దాదాపు 600 గొర్రెలు ఉన్నాయి. వీటిన్నింటినీ ఒకేమందగా ఏర్పాటు చేసి పెంచుతున్నారు. వీటిని ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం గ్రామశివారులోని వరి పొలాల్లోకి తీసుకెళ్లారు. వరి కోసిన పొలంలో మేత మేసిన గొర్రెలను రాత్రి ఇంటికి తీసుకొచ్చారు.
శనివారం ఉదయం చూసేవరకు గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. అందులో కొన్ని మృత్యువాత పడ్డాయి. వెంటనే స్థానిక పశువైద్యాధికారి అజయ్‌కుమార్‌కు వారు సమాచారం అందించారు. ఆయన వచ్చేలోగా 32 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. సిబ్బంది సాయంతో మిగతా వాటికి ధర్మారంలోని ప్రైవేటు మెడికల్ షాపుల నుంచి మందులను తెప్పించి వేశారు. అయినా.. వాటి పరిస్థితిలో మార్పు కనిపించలేదు. సాయంత్రం వరకు మరో 16 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. మొత్తంగా రాత్రి వరకు మొత్తం 48 గొర్రెలు మృత్యువాత పడగా మరికొన్ని మరణించే అవకాశం ఉందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. మరణించిన గొర్రెల తో దాదాపు రూ.5లక్షలకుపైగా నష్టం వాటిల్లిందని కాపలదారులు ఆందోళన చెందుతున్నారు.
విషాహారమా? అంతుచిక్కని రోగమా ?
అస్వస్థతకు గురైన రెండురోజులకే గొర్రెలు మృత్యువాత పడడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఐదుగురు గొర్రెల పెంపకందారులు సామూహికంగా గ్రామశివారులోని కోసిన వరి పొలంలో మేతకు తీసుకుళ్లిన రాత్రి నుంచే అస్వసత్థకు గురికావడం.. ఆ వెంటనే ఒకదాని వెనుక మరోటి మృత్యువాత పడడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పొలం పంట కోసం క్రిమిసంహాకర మందు పిచికారీ చేసిన గడ్డి తినడంతో ఘటన జరిగిందా? లేదా మరేదైన వింతవ్యాధి సోకిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై పశువైద్యాధికారి అజయ్‌ను వివరణ కోరగా పొలంలో చల్లించిన విషపూరిత గుళికల ప్రభావంతో మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీనిపై జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తానని ఆయన అన్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి
వేములవాడరూరల్: వేములవాడ మండలం నందికమాన్ వద్ద ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు. కోనరావుపేట మండలం కొలనూరుకు చెందిన కూన తిరుపతి(45) వేములవాడ అర్బన్ మండలం కొడుముంజలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్నాడు. కరీంనగర్ డిపోకు చెందిన బస్సు ఢీకొన్న సంఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య లావణ్య, కూతురు అక్షయ, కుమారులు హేమంత్, ఆదిత్య ఉన్నారు. ఈ సంఘటనపై పట్టణ సీఐ వీరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.