
కాళేశ్వరం టు హైదరాబాద్
విద్యానగర్(కరీంనగర్): ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మంథని నియోజకవర్గంలో ఉన్న కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఈనెల 14 నుంచి సరస్వతీ పుష్కరాలు వైభవంగా సాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచే కాకుండా ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వేలాదిమంది నిత్యం తరలివెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్లేవారు ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ఉన్న పలు దర్శనీయ ప్రాంతాలను తిలకించవచ్చు.
● హైదరాబాద్ వాసులు వరంగల్ మీదుగా సరస్వతీ పుష్కరాలకు కాళేశ్వరం వెళ్తే ఉస్మాన్ సాగర్ సరస్సు, కీసరగుట్ట, శామీర్‌పేట్ లేక్ వ్యూ తిలకించవచ్చు.
● వరంగల్ జిల్లాలో ప్రవేశించిన తరువాత పాకాల సరస్సు, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం, కాకతీయ రాక్ గార్డెన్, కాకతీయ మ్యూజికల్ గార్డెన్, భద్రకాళి ఆలయం, రామప్ప సరస్సు, రామప్ప ఆలయాన్ని దర్శించవచ్చు.
● మేడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్‌హౌజ్ సందర్శించిన తరువాత కాళేశ్వరం చేరుకుని సరస్వతీ పుష్కర స్నానాలు చేసి కాళేఽశ్వర మక్తీశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవచ్చు.
● తిరుగు ప్రయాణంలో కరీంనగర్ మీదుగా హైదరాబాద్‌కు వెళ్తే మార్గమధ్యలో ఉన్న మంత్ర కూటమిగా ప్రసిద్ధి చెంది, గోదావరి తీరంలో ఉన్న మంథనిలోని బౌద్ధ, జైన క్షేత్రాలను, గౌతమేశ్వర, సిద్దేశ్వర, వరద రాజేశ్వర తదితర 20 ఆలయాలను దర్శించవచ్చు.
● పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లోని రామగిరి దుర్గం సందర్శించవచ్చు. ఈ దుర్గంపై సీతారాముల ఆలయం, రామస్థాపిత శివలింగం, జానకీదేవి పాదముద్రలతోపాటు అనేక కట్టడాలు ఉన్నాయి.
● కమాన్‌పూర్ మండలకేంద్రంలోని ఆదివరాహస్వామివారిని దర్శించుకోవచ్చు. కోరిన కోర్కెలు తీర్చే ఆదివరాహస్వామి మహిమగల దేవుడని ప్రసిద్ధి. మంథని ఎక్స్‌రోడ్డు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది.
● సుల్తానాబాద్ దగ్గరలోని ధూళికట్టలో శాతావాహనుల కాలం నాటి కోటలు, బౌద్ధ స్తూపాలు చూడవచ్చు. కరీంనగర్‌లో ఎలగందుల ఖిల్లా, ఉజ్వలపార్క్, రాజీవ్ జింకల పార్క్, అగ్రహారం, నాంపల్లి గుట్ట వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని, సిద్దిపేట మీదుగా హైదరాబాద్ చేరుకోవచ్చు.
వయా కరీంనగర్
దారిలో అనేక దర్శనీయ స్థలాలు
పుష్కరాలకు వచ్చేవారికి మధురానుభూతి