
ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
ధర్మపురి: ధర్మపురి గోదావరిలోని పుష్కరఘాట్ వద్ద శనివారం ఓ వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వేంకటేశ్వర్లపల్లెకు చెందిన రాయశెట్టి సాయిలు (70) శనివారం దైవ దర్శనం కోసం ధర్మపురి వచ్చాడు. గోదావరిలోని పుష్కరఘాట్ వద్ద లుంగితో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయిలు భార్య గతంలోనే మృతి చెందినట్లు సమాచారం. అప్పటినుంచి మనస్తాపానికి గురవుతున్న సాయిలు.. తాను కూడా ధర్మపురిలోనే చనిపోతానని అంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయిలుకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కుమారుడు భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపారు.
విద్యుత్‌షాక్‌తో మాజీ సర్పంచ్ మృతి
హుజూరాబాద్: విద్యుత్‌షాక్‌తో సైదాపూర్ మాజీ సర్పంచ్ కనుకుంట్ల విజయకుమార్(57) శని వారం మృతి చెందాడు. స్థానికు ల వివరాల ప్రకారం.. విజయ్ కుమార్ హనుమాన్ దీక్షలో ఉన్నాడు. శనివారం ఉదయం ఇంటివద్ద పూజ ముగించుకొని వాటర్ ప్లాంట్ షెడ్డు పక్కన ఉన్న జేవైరుపై టవల్ అరవేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విజయ్‌కుమార్ భార్య కవిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు
సిరిసిల్ల: హైదరాబాద్‌లోని కొండాలక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐటీహెచ్) కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చేనేత, జౌళిశాఖ అధికారులు పేర్కొన్నారు. మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు జూలై ఒకటో తేదీ నాటికి బీసీ, ఇతర సాధారణ వర్గాలకు 23 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. 2025–2026 విద్యాసంవత్సరానికి 60 సీట్లు ఉన్నాయని, ఎంపికై న అభ్యర్థులకు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కమిషన్ ద్వారా నెలకు రూ.5వేలు, తెలంగాణ చేనేత, జౌళిశాఖ ద్వారా మరో రూ.2500 ఉపకార వేతనం అందిస్తారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 91105 56854, 96181 15357, 77948 97298, 90300 79242 నంబర్లలో సంప్రదించగలరు.