
తాళం వేసిన ఇంట్లో చోరీ
● 14 తులాల బంగారం, 50తులాల వెండి అపహరణ
● క్లూస్‌టీంతో రంగంలోకి దిగిన పోలీసులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లలో రంగంలోకి దిగారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు. రాచర్లబొప్పాపూర్‌కు చెందిన ఈరవేణి లతిక–శివకుమార్ దంపతుల ఇంట్లో శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని దొంగలు ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. వేసవి సెలవులు కావడంతో లతిక ఇంటికి తాళం వేసి ఐదు రోజుల క్రితం తన తల్లి గారి ఊరు దోమకొండ మండలం అంబారిపేటకు వెళ్లింది. శనివారం తిరిగి రాగా.. ఇంటి తాళం పగులగొట్టి ఉండడం గమనించి.. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు ధ్వంసం చేసి ఉన్నాయి. అందులో దాచి ఉంచిన సుమారు 14తులాల బంగారం, 50తులాల వెండిని దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించింది. లతిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు.