
22న కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్ల ప్రారంభం
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్ల ప్రారంభోత్సవం తేదీ ఖరారైంది. ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రెండు రైల్వేస్టేషన్లు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఉమ్మడి జిల్లాలో రామగుండం, కరీంనగర్, పెద్దపల్లి రైల్వేస్టేషన్లను అటల్ మిషన్ ఫర్ రిజునవేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌మిషన్ పథకం కింద రూ.73 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొదటిఫేజ్‌లో కరీంనగర్‌కు రూ.26.06 కోట్లు, రామగుండంకు రూ.26.50 కోట్లు విడుదలయ్యాయి. వాస్తవానికి గత నెలలోనే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండాల్సి ఉండగా.. పహల్గాం ఉగ్రదాది, ఆ తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కారణంగా కార్యక్రమం వాయిదాపడింది. ఆదివారం కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో ఏర్పాట్లను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పరిశీలించనున్నారు.
జీఎం పర్యటన
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ పరిశీలించారు. ఈ నెల 22న రైల్వేస్టేషన్‌ను ప్రారంభిస్తున్న దృష్ట్యా పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ రైల్వే జీఎంను కలిసి పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. స్టేషన్ మేనేజర్ ఎం.రవీందర్, అధికారులు పాల్గొన్నారు.
హైపర్ టెన్షన్ డే ర్యాలీ
కరీంనగర్‌టౌన్: ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నగరంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని డీఎంహెచ్‌వో వెంకటరమణ ప్రారంభించారు. సిబ్బందికి స్క్రీనింగ్ చేసి రక్తపోటు నిర్ధారణ అయిన వారికి చికిత్స అందించారు. డాక్టర్లు ఉమాశ్రీరెడ్డి, విప్లవశ్రీ, సనా, రాజగోపాల్, స్వామి పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రాల తనిఖీ
కరీంనగర్‌క్రైం: డిగ్రీ పరీక్షలు జరుగుతున్న కరీంనగర్‌లోని అన్ని డిగ్రీ కళాశాలల సెంటర్లను శాతవాహన విశ్వవిద్యాలయ వీసీ యు.ఉమేశ్‌కుమార్ శనివారం చేశారు. ఇన్విజిలేషన్ విధానం, విద్యార్థుల హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాల్లో వసతులు, పరీక్షలు నిర్వహణ అంశాలను పరిశీలించారు.
బెస్ట్ అవెలబుల్ స్కూల్స్ ఎంపికకు దరఖాస్తులు
విద్యానగర్(కరీంనగర్): 2025–26 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవెలబుల్ స్కూల్స్ ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఉప సంచాలకుడు పి.పవన్‌కుమార్ తెలిపారు. రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్‌లో ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేయడానికి జిల్లాలోని ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ పథకంలో రెసిడెన్షియల్‌లో ప్రతి విద్యార్థికి ట్యూషన్, హాస్టల్ వసతి, భోజనానికి రూ.42వేలు, నాన్ రెసిడెన్షియల్‌లో ప్రతి విద్యార్ధికి రూ.28వేలు చెల్లించడం జరుగుతుందన్నారు. ఆసక్తిగల పాఠశాలల యాజమాన్యాలు ఈనెల 22 వరకు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
22న హ్యాండ్‌బాల్ జట్ల ఎంపిక
కరీంనగర్‌స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని అకడమిక్ హైట్స్ పాఠశాలలో అండర్–19 జూనియర్స్ బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష కార్యదర్శులు వీర్ల వెంకటేశ్వర్ రావు, బసరవేణి లక్ష్మణ్ తెలిపారు. రాణించిన క్రీడాకారులను ఈ నెల 28 నుంచి 30వరకు నల్గొండ జిల్లా నకిరేకల్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రంతో మధ్యాహ్నం 3గంటలకు రిపోర్టు చేయాలని, వివరాలకు 9441925807, 8978995730 నంబర్లను సంప్రదించాలన్నారు.

22న కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్ల ప్రారంభం

22న కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్ల ప్రారంభం