
ప్రతిభకు ప్రోత్సాహం
● కార్పొరేట్ విద్యకు స్నేహహస్తం ● ప్రభుత్వ విద్యాసంస్థల్లో పదోతరగతి పూర్తి చేసుకున్నవారికి సదావకాశం ● కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య ● ఈనెల 31వరకు ప్రవేశాలకు తుది గడువు
కరీంనగర్: విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ కీలకం. ఇంటర్ విద్య కోసం ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలో చేరాలని అందరికీ ఉంటుంది. ఇలాంటి వారి కలసాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘కార్పొరేట్ విద్య’ పథకాన్ని తీసుకొచ్చింది. పదో తరగతిలో ప్రతిభ చాటిన వారు ఈ పథకం ద్వారా ఉజ్వల భవితకు బాటలు వేసుకునేందుకు వీలుంటుంది. దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది.
భర్తీకి అధికారుల దృష్టి
కార్పొరేట్ కళాశాల విద్యా పథకం ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి పూర్తి చేసుకున్న వారికి ఓ వరం. రెండేళ్ల పాటు విద్యార్థులకు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. అవగాహన లోపం, తగినంత ప్రచారం లేకపోవడంతో ఈ పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతం మాదిరిగా కాకుండా ఈ విద్యా సంవత్సరం కేటాయించిన సీట్లు పూర్తిస్థాయిలో భర్తీపై అధికారులు దృష్టిసారించారు.
వీరికే అవకాశం
ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలతో పాటు దివ్యాంగ విద్యార్థులు కార్పొరేట్ కళాశాల పథకంతో లబ్ధి పొందేందుకు అవకాశం కల్పించింది. 2025–26 విద్యా సంవత్సరానికి ఇంటర్‌లో చేరేందుకు ప్రభుత్వ యాజమాన్యాల్లోని విద్యాసంస్థల్లో పదోతరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించనున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు ఫీజు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ఇవీ అర్హతలు
విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల, ఆదర్శ, కేజీబీవీ, ఎయిడెడ్, బెస్ట్ అవలెబుల్, నవోదయ పాఠశాలల్లో చదివి ఉండాలి. జీపీఏ 7.0 ఆపై సాధించిన వారు అర్హులు.
దరఖాస్తు విధానం
విద్యార్థులు http://telanganaepass. cg g.g ov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 31వ తేదీ తుది గడువు. 10వ తరగతి పాస్ మెమో, కులం, ఆదాయం(రూ.2లక్షల లోపు ఉండాలి) ధృవీకరణ పత్రాలు మీసేవా ద్వారా పొందినవి, బ్యాంకు పాస్‌బుక్, ఆధార్‌కార్డు నంబర్, రేషన్‌కార్డు నంబర్, పాస్‌పోర్టు సైజ్‌ఫొటో, ప్రభుత్వ షెడ్యూల్డ్ కులం వసతి గృహాల విద్యార్థులు(3) సంవత్సరాల బోనోఫైడ్ ధ్రువీకరణ పత్రం జతపర్చాలి. ఈ పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునేటప్పుడు విద్యార్థులు ప్రాధాన్యత క్రమంలో మూడు కళాశాలలను ఎంపిక చేసుకోవాలి.
జిల్లాలో ఈ ఏడాది పదోతరగతి ఫలితాలు
అంశం బాలురు బాలికలు మొత్తం
హాజరైనవారు 6,616 5,892 12,508
ఉత్తీర్ణులు 6,451 5,794 12,245
ఉత్తీర్ణత శాతం 97.51 98.34 97.90
మంచి అవకాశం
కార్పొరేట్ కళాశాల విద్యా పథకంతో పేద విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. ఎలాంటి ఫీజులు చెల్లించకుండానే ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేయవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో గడువులోగా దరఖాస్తులు సమర్పించాలి. రెండేళ్ల పాటు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య వసతులు సద్వినియోగం చేసుకోవాలి.
– పి.పవన్‌కుమార్,
జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి

ప్రతిభకు ప్రోత్సాహం