
ముంపు.. ముప్పు!
కానరాని ముందుచూపు
● ఏటా వానాకాలం అదే సమస్య ● అయినా పాఠం నేర్వని బల్దియా ● ౖపైపెనే సిల్ట్ తొలగింపు పనులు
కరీంనగర్ కార్పొరేషన్:
ఏటా వర్షాకాలం నగరం ఎదుర్కొనే ముంపు ముప్పుపై నగరపాలకసంస్థకు ముందు చూపు కరువైంది. వర్షం కురిసిన ప్రతీసారి ఈ సమస్య నగరాన్ని అతలాకుతలం చేస్తున్నా, నివారణ చర్యలు కనిపించడం లేదు. మరో నెల రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికి, ముంపు ప్రాంతాలను రక్షించేందుకు అధికారుల వద్ద ఇప్పటివరకు ఎలాంటి ప్రణాళిక లేకుండా పోయింది.
వానొస్తే జాగారమే
నగరంలోని ముకరంపుర విమానం వీధి ప్రజలకు వర్షాకాలం వస్తుందంటే కంటిమీద కునుకుండదు. గట్టివాన పడితే డ్రైనేజీ ద్వారా ఇళ్లను మురుగునీళ్లతో కూడిన వరద ముంచెత్తుతుంది. నగరంలోని ఎగువ ప్రాంతాలైన రాంనగర్, పద్మనగర్, జ్యోతినగర్ తదితర ప్రాంతాల నుంచి ముకరంపుర, అంబేడ్కర్ స్టేడియం, లక్ష్మినగర్ మీదుగా వెళ్లే అతి పెద్ద నాలా ఈ వీధి పక్కనుంచి వెళ్తుంది. కరీంనగర్, సిరిసిల్ల ప్రధాన రహదారిపై నిర్మించిన కల్వర్టు గుండా వరదనీళ్లు దిగువభాగానికి సులువుగా వెళ్లడం లేదు. కల్వర్టు కింద సిల్ట్ రాయిలా మారడం, చెత్తా చెదారం ఇరుక్కుపోవడంతో వరదనీళ్లు నిలిచిపోతున్నాయి. సిల్ట్ తీయకపోవడంతో కొద్దిపాటి వరదకే నాలా పక్కనే ఉన్న విమానం వీధిని, ఇళ్లను నీళ్లు ముంచెత్తుతున్నాయి. గతేడాది ఇళ్లల్లోకి వచ్చిన మురుగునీళ్లతో వంటసామగ్రి, ఆహారపదార్థాలు, వస్తువులు పూర్తిగా తడిసిపోయిన సంఘటనను ఇంకా కాలనీ వాసులు మరిచిపోలేదు. మళ్లీ వర్షాకాలం వస్తున్నా, పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ ఏడాది కూడా తమకు ముంపు తప్పేట్లులేదని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.
వరద ముందుకు పోయేదెలా?
ప్రతి వర్షాకాలం నగరంలోని ఆర్‌టీసీ వర్క్‌షాప్, రాంనగర్, శర్మనగర్,మంచిర్యాల చౌరస్తా, కోతిరాంపూర్, ఎన్‌టీఆర్ చౌరస్తా, రాజీవ్‌రహదారి బైపాస్ తదితర ప్రాంతాల్లో ముంపు ప్రభావం అధికంగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో వరదనీళ్లు సాఫీగా వెళ్లే పరిస్థితి లేకపోవడం మూలంగా, అవి ముంపునకు గురవుతున్నాయి. రహదారిలపై ఉన్న కల్వర్టులు చిన్నగా ఉండడం, నాలాలు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉండడం, సిల్ట్ తొలగించకపోవడం, నిర్వహణా లోపం ఫలితంగా వర్షాకాలం ముంపు తప్పడం లేదు. నాలాల నుంచి వచ్చే భారీ వరదకు సరిపడా కల్వర్టులు లేకపోవడంతో వరద మెయిన్ రోడ్డెక్కుతుంటాయి. ఏటా ఈ సమస్య ఎదురవుతున్నా, ఇప్పటివరకు కల్వర్టు వైశాల్యం పెంచడం, నాలాలను సరిచేయడం లాంటి శాశ్వత పనులు చేపట్టడం లేదు.
నామమాత్రంగా సిల్ట్ తొలగింపు
ప్రతి వర్షాకాలం ముందు నాలాలు, డ్రైనేజీల్లో సిల్ట్ తీయడానికి టెండర్ పిలుస్తారు. ఈ ఏడాది నగరవ్యాప్తంగా 15 పనులకు గాను సుమారు రూ.44 లక్షలతో టెండర్ పిలిచారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ కాంట్రాక్ట్ ఖరారు కానుంది. టెండర్ దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లు సిల్ట్‌ను ౖపైపెనే తీస్తున్నారని, లోతుకు వెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. సిల్ట్ రాయిలా మారిన చోట డ్రిల్లింగ్‌తో తొలగించే అవసరం పడుతుంది. అలా కాకుండా ౖపైపెనే చెత్తాచెదారం, సిల్ట్ తీస్తుండడం, కిందిభాగంలో రాయిలా మారిన సిల్ట్ అలానే ఉండడంతో పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. పూర్తిస్థాయి వర్షాకాలానికి సమయం ఉన్నందున ఇప్పటికై నా ముంపు ప్రాంతాలను గుర్తించి, శాశ్వత పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం నగరపాలకసంస్థ ఉన్నతాధికారులపై ఉంది.
అధికారుల్లో పట్టింపు లేదు
ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని చెబుతున్నా అధికారులు పట్టించుకోవం లేదు. రాంనగర్ రోడ్ నెంబర్ 7 వద్ద మెయిన్ డ్రైనేజీ సిల్ట్‌తో నిండి మురుగునీళ్లు ముందుకు కదలడం లేదు. గతేడాది ఇలానే నీళ్లు వెళ్లే పరిస్థితి లేక వర్షాకాలం కాలనీలోని ఇండ్లకు నీళ్లు చేరాయి. ముందుగా సిల్ట్ తొలగించి ముంపు బాధనుంచి తప్పించాలని చెబుతున్నా,సీడీఎంఏకు కూడా ఫిర్యాదు చేసినా స్పందన లేదు.
– బోనాల శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్

ముంపు.. ముప్పు!

ముంపు.. ముప్పు!

ముంపు.. ముప్పు!