
వ్యక్తిగత బాధ్యతతోనే డెంగీ నివారణ
● జిల్లా వైద్యాధికారి వెంకటరమణ
కొత్తపల్లి(కరీంనగర్): వ్యక్తిగత బాధ్యతతోనే డెంగీని నివారించవచ్చునని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కొత్తపల్లి ఆరోగ్య కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో వెంకటరమణ మాట్లాడుతూ ఏటా మే 16న నిర్వహించే ప్రపంచ డెంగీ దినాన్ని ఈ ఏడాది చెక్, క్లీన్, కవర్ అనే ప్రతిజ్ఞతో జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఇన్‌ఫెక్టెడ్ ఆడ ఏడిస్ ఈజిప్ట్ దోమకాటుతో డెంగీ వ్యాప్తి చెందుతుందన్నారు. నీరు నిలిచే ప్రాంతాలను శుభ్రపరచడం, పాత్రలు, ట్యాంకులు మూతలతో కప్పి ఉంచడంతో పాటు మన శరీరాన్ని కప్పి ఉండే విధంగా దుస్తులు ధరించడం వల్ల డెంగీని నిరోధించవచ్చన్నారు. అంతకముందు రోగుల వివరాలు, మందుల నిల్వలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీటీసీవో కె.వీ.రవీందర్‌రెడ్డి, పీవోడీటీ ఉమాశ్రీ రెడ్డి, డీఐవో సాజిదా, పీవోఎన్ సీడీ విప్లవ శ్రీ, పీఓఎంసీహెచ్ సనా జవేరియా, డీఎంవో శైలేంద్ర, డెమో రాజగోపాల్, డీపీవో స్వామి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నజియా, సబ్ యూనిట్ ఆఫీసర్ రామనాథం, మల్లయ్య పాల్గొన్నారు.