
ప్రకృతి సాగు.. ఆరోగ్యం బాగు
కరీంనగర్‌అర్బన్: సారవంతమైన నేలలు నిస్సారమవుతున్నాయి. విచ్చలవిడిగా ఎరువులు, మందుల వాడకంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. ప్రజారోగ్యంతో పాటు సాగు నేలలను సారవంతంగా మార్చాలని కేంద్రం బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. నేషనల్ మిషన్.. నేచురల్ ఫార్మింగ్ పేరుతో కార్యక్రమం అమలు చేస్తోంది. సహజ పద్ధతుల్లో విభిన్న పంటలు పండించేలా రైతులను ప్రొత్సహించనుంది. మూస పద్ధతిలో సాగుకు స్వస్తి పలికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జించే పంటలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందు కోసం జిల్లాలో మండలానికో గ్రామం చొప్పున ఎంపిక చేసి నివేదిక పంపాలని ఆదేశించింది. ఈ క్రమంలో కరీంనగర్ అర్బన్ మినహా 15 మండలాలకు గానూ 15 గ్రామాలను ఎంపిక చేసి నివేదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదముద్ర తదుపరి త్వరలోనే శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవనున్నాయి.
ఏంటీ జాతీయ సహజ వ్యవసాయ మిషన్
ఇప్పటికే సాగులో సేంద్రియ పద్ధతులు పాటిస్తున్న రైతులు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్), వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీవోలు), స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీలు) వంటి వాటికి ఈ పథకంలో ప్రాధాన్యమిస్తారు. సురక్షితమైన పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సహజ సాగు పద్ధతులను ప్రోత్సహిస్తుంది. 2025–26లో ఈ పథకం కోసం వెచ్చించే రూ.2,481 కోట్ల మూలధనంలో కేంద్ర ప్రభుత్వం రూ.1,584 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.897 కోట్లు ఖర్చు చేయనున్నాయి. సేంద్రియ వ్యవసాయానికి అవసరమయ్యే సహజ ఉత్పత్తులను రైతులకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు అవసరాన్ని బట్టి జీవాధార వనరుల కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రైతుల పొలాల్లో 2వేల వరకు నమూనా సహజ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పుతారు. ఆసక్తి గల రైతులకు నిపుణులైన శిక్షకులు సహజ వ్యవసాయ పద్ధతులు, జీవ ఎరువుల తయారీ వంటి వాటిలో శిక్షణనిస్తారు. జిల్లాల్లో ఎంపిక చేసిన వ్యవసాయ క్లస్టర్లలో ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు, స్థానిక రైతుల మధ్య సహకారం పెంచేందుకు కృషి సఖులు, సాగు సహాయకుల (సీఆర్పీ)ను ఉపయోగించుకోనున్నారు.
నేల సారవంతానికి కేంద్రం చర్యలు
మండలానికో గ్రామం ఎంపికకు ఆదేశం
ప్రయోజనాలిలా..
సేంద్రియ ఎరువులు, సంబంధ పద్ధతుల వాడకం వల్ల నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి, భూసారం మెరుగుపడుతుంది. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గడం వల్ల వాతావరణంలో కార్బన ఉద్గారాలు తగ్గుతాయి. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్, ధర ఉండటం వల్ల రైతులకు ఆదాయం పెరుగుతుంది. సేంద్రియ ఉత్పత్తులు మానవ ఆరోగ్యానికి సురక్షితమైనవి. పోషక విలువలను అధికంగా కలిగి ఉంటాయి. కాగా నేషనల్ మిషన్.. నేచురల్ ఫార్మింగ్ పథకం కోసం మండలానికో గ్రామం ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించామని, ప్రభుత్వం ఆమోదం అనంతరం కార్యక్రమం ప్రారంభమవుతుందని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు.