
మౌలిక వసతుల పనులు పూర్తి చేయండి
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్‌అర్బన్: మౌలిక సదుపాయాల పనులకు సంబంధించి గ్రౌండింగ్ వర్క్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రహరీ, టాయిలెట్స్, కిచెన్ షెడ్ వంటి మౌలిక అవసరాల నిర్మాణానికి పనులు మంజూరు చేశామని తెలిపారు. ఇంకా కొన్ని అభివృద్ధి పనులకు ఇప్పటికీ గ్రౌండింగ్ వర్క్ పూర్తి కాలేదని, సంబంధిత శాఖల హెచ్‌వోడీలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవతో ఎంపీడీవో, ఆర్డీవోల సమన్వయంతో ఈ నెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సంబంధించి విచారణ అధికారులు పకడ్బందీగా విచారించాలన్నారు. అనర్హులకు మంజూరైనట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, మిషన్ భగీరథ అధికారులు నీటి సరఫరా వ్యవస్థ పై నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, డీటీడీవో పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మహాసభలను విజయవంతం చేయాలి
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్‌టౌన్: గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 30, 31న అమెరికా వాషింగ్‌టన్‌లో జరిగే మహాసభలలో మున్నూరుకాపులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం అపెక్స్ కమిటీ గౌరవ చైర్మన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. సోమవారం మహాసభల పోస్టర్‌ను జ్యోతినగర్‌లో ఆవిష్కరించారు. మున్నూరుకాపులందరూ రాజకీయాలకతీతంగా, ఐక్యంగా ముందుకు సాగలన్నారు. గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ కన్వీనర్ సంగని రజనీకాంత్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య, జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆర్‌వీ మహేందర్, నాయకులు ప్రకాశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
నేల ఆరోగ్యాన్ని కాపాడాలి
జమ్మికుంట(హుజూరాబాద్): పంట మార్పిడి, సేంద్రియ ఎరువుల వాడకంతో నేల ఆరోగ్యాన్ని కాపాడాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం మండలంలోని మడిపల్లి రైతు వేదికలో జయశంకర్ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమంలో డీఏవో, కేవీకే సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వర్‌రావు, డీహెచ్‌ఎస్‌వో శ్రీనివాస్‌రావు, శాస్త్రవేత్త నర్సయ్య మాట్లాడారు. పంటలో అధిక మోతాదులో యూరియా వాడకం వల్ల చీడపీడలు పెరిగి సాగు వ్యయం పెరుగుతుందని, వ్యవసాయ అధికారుల సూచన మేరకే వాడుకోవాలన్నారు. భావితరాలకు సారవంతమైన నేలను అందించాలన్నారు. విత్తనాలు, పురుగుమందుల కొనుగోలు సమయంలో రసీదులను పంటకాలం ముగిసేవరకు భద్రపరుచుకోవాలని, పంటనష్టం జరిగితే కష్టకాలంలో పని చేస్తాయని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఏడీఏ సునీత, ఏవో ఖాదర్‌హుస్సేన్, ఏఈవోలు రామ్‌ప్రసాద్, మహేందర్, అచ్యూత్, అర్చన తదితరులు పాల్గొన్నారు.
నియమాలు పాటించాలి
జమ్మికుంట(హుజూరాబాద్): విద్యుత్ ప్రమాదాల నివారణకు వినియోగదారులు, సిబ్బంది నియమాలు పాటించాలని ఎస్‌ఈ రమేశ్‌బాబు అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో విద్యుత్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ భద్రత పోస్టర్లు ఆవిష్కరించారు. డివిజనల్ ఇంజినీరు (ఆపరేషన్స్) ఎస్ లక్ష్మారెడ్డి, టెక్నికల్, సేఫ్టీ ఆఫీసర్ ఉపేందర్, ఏడీఈ రాజేందర్, టౌన్ ఏఈ ఆనంద్, రూరల్ ఏఈ రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.

మౌలిక వసతుల పనులు పూర్తి చేయండి

మౌలిక వసతుల పనులు పూర్తి చేయండి