
హత్య కేసులో రాజీకి అంగీకరించలేదని..
● ప్రధాన నిందితుడిపై మరో ఇద్దరు నిందితుల దాడి ● కత్తిపోట్లతో తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
గోదావరిఖని: హత్యకేసులో ప్రధాన నిందితుడు తిరుపతిపై అదేకేసులో ఏ–2, ఏ–3గా ఉన్న మరో ఇద్దరు నిందితులు కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై భూమేశ్ కథనం ప్రకారం.. స్థానిక ప్రశాంత్‌నగర్‌కు చెందిన చీమల తిరుపతిపై అదే ప్రాంతానికి చెందిన రాగుల రాజశేఖర్, బోనగిరి రాకేశ్ దాడిచేశారు. ఈముగ్గురు 2021లో ప్రశాంత్‌నగర్‌కు చెందిన బండారి మొగిలి హత్య కేసులో నిందితులు. జైలుకు వెళ్లి బెయిల్‌పై ఇటీవల విడుదలయ్యారు. కేసు ట్రయల్‌కు వస్తోంది. దీంతో ప్రధాన నిందితుడి వద్దకు వెళ్లి కేసు రాజీ పడదామని మిగతా ఇద్దరు ప్రతిపాదించారు. కేసు కొట్టుడు పోతుందని, కేసు రాజీ అవసరం లేదని ప్రధాన నిందితుడు తిరుపతి రాజీకి ఒప్పుకోలేదు. ఈవిషయంలో ముగ్గురి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఈక్రమంలో శుక్రవారం తిరుపతి నడుపుతున్న ఎస్‌ఎం ఆన్‌లైన్ సెంటర్ వద్ద బైక్‌పై అటూఇటూ తిరుగుతుండటంతో గమనించిన తిరుపతి.. ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారని ఫోన్‌లో ప్రశ్నించాడు. దీంతో వారు ఫోన్ కట్‌చేసి బైక్ పైనుంచి దిగివచ్చి తిరుపతిపై కత్తులతో దాడి చేశారు. స్థానికులు గుమికూడటంతో నిన్ను ఎప్పటికై నా చంపుతామని బెదిరించి నిందితులు పరారయ్యారు. గాయాల పాలైన చీమల తిరుపతి భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాగుల రాజశేఖర్, బోనగిరి రాకేశ్‌పై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు. కత్తిపోట్లకు గురైన తిరుపతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.